బర్త్ డే స్పెషల్ : త్రివిక్రమ్ సినీ కెరీర్, వ్యక్తిగత విశేషాలు….!! 

-

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన ఆకట్టుకునే పంచ్ డైలాగులతో మాటల మాంత్రికుడుగా పేరుగాంచిన రచయిత మరియు దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్, నేడు తన 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. పుట్టింది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, అలానే ఆయన బాల్యం మరియు కాలేజీ విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే జరిగింది. ఇక ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ తరఫున న్యూ న్యూ క్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్న త్రివిక్రమ్ కు మొదటి నుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు తన స్నేహితుడైన కమెడియన్ సునీల్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్న త్రివిక్రమ్, అనంతరం నటుడు గౌతమ్‌రాజు ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించటం జరిగింది.


ఇక తొలిసారి తన కలానికి పదును పెట్టి, 1999లో వేణు తొట్టెంపూడి హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం సినిమాకు కథ మాటలు అందించారు త్రివిక్రమ్. అయితే అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రచయితగా త్రివిక్రమ్ కు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత పలు సినిమాలకు కథ మరియు మాటల రచయితగా పనిచేసిన త్రివిక్రమ్, తొలిసారిగా తరుణ్ మరియు శ్రియల కలయికలో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. దర్శకత్వం వహించిన తొలి సినిమానే దర్శకుడిగా ఆయనకు మంచి సక్సెస్ ని అందించింది. ఆ తర్వాత ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతడు మూవీ తెరకెక్కించిన త్రివిక్రమ్, సునాయాసంగా ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించి మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా, అల్లు అర్జున్ తో జులాయి, అలానే మరోసారి పవన్ తో అత్తారింటికి దారేది, నితిన్ తో ఆ ఆ, మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి సూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించిన త్రివిక్రమ్, అజ్ఞాతవాసితో భారీ ఫ్లాపును కూడా చవిచూశారు.పవన్‌కళ్యాణ్‌కు అత్యంత ప్రియమిత్రుడైన త్రివిక్రమ్‌, ఆయన విజ్ఙప్తితో కొన్ని సినిమాలకు పేరు లేకుండా మాటలు అందించాడు.

స్వతహాగా సాహిత్యపిపాసి అయిన త్రివిక్రమ్‌కు పుస్తకాలంటే విపరీతమైన పిచ్చి. ఎటువంటి పుస్తకం కనబడ్డా చదవకుండా వదిలిపెట్టడని ప్రతీతి. ఆయన మాటలు కూడా సినిమాలలో మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఆయన రాసిన ఎన్నో డైలాగులు సూపర్‌హిట్టయి, ‘మాటల మాంత్రికుడు’ అనే బిరుదును కట్టబెట్టాయి. సునిశితమైన హాస్యాన్ని పండించడంలో ఆయన దిట్ట. త్రివిక్రమ్‌కు భార్య సౌజన్య, ఇద్దరు పిల్లలున్నారు. సౌజన్య ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి సమీప బంధువు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఆయన తెరకెక్కిస్తున్న అల.. వైకుంఠపురములో సినిమా పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు పెద్ద హిట్టయి, యూట్యూబ్‌ రికార్డులను తిరగరాస్తున్నాయి. రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ సాధించి త్రివిక్రమ్ కి పేరు తీసుకు వస్తుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news