వేల కోట్లకు అధిపతి.. గ్రాండ్​గా సిల్వర్​స్క్రీన్​ ఎంట్రీ.. ఎవరీ లెజెండ్​ శరవణన్‌?

-

లెజెండ్‌ శరవణన్‌ కథానాయకుడిగా పరిచయమవుతూ, స్వయంగా ఆయనే నిర్మించిన చిత్రం ‘ది లెజెండ్​’. ఇన్నాళ్లూ వ్యాపారవేత్తగా రాణించిన ఆయన 50ఏళ్ల వయసులో కథానాయకుడిగా మారారు. నటుడిగా మారాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్‌తో వెలుగులోకి వచ్చారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్​లో ఊర్వశి రౌటేలా కథానాయిక. ఈ నేపథ్యంలో అందరినీ తొలి చేస్తున్న ప్రశ్న ఒక్కటే. ఇంతకీ ఎవరీ ‘ది లెజెండ్‌’ హీరో? ఆయన గురించే ఈ కథనం..

శరవణ స్టోర్స్‌.. తమిళనాడులో ఈ పేరు వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. టెక్స్‌టైల్స్‌, జ్యువెలరీ స్టోర్స్‌తో పాటు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, నగలు ఇలా శరవణ స్టోర్స్‌లో దొరకనిదంటూ ఏమీ లేదు. ఈ రిటైల్‌స్టోర్స్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరవణన్‌ సెల్వరత్నమ్‌ కుమారుడే అరుళ్‌ శరవణన్‌.

అరుళ్‌ శరవణన్‌ 1970వ సంవత్సరంలో చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి శరవణన్‌ సెల్వరత్నమ్‌ వ్యాపారవేత్త.

చదువు పూర్తయిన తర్వాత అరుళ్‌ శరవణన్‌ వ్యాపార నిర్వహణలోకి వచ్చేశారు. కొన్నేళ్లుగా దుస్తులు, ఫర్నిచర్‌, జ్యువెలరీ సహా వివిధ వ్యాపారాలను చూసుకుంటున్నారు. వీటి విలువ వందల కోట్ల పైమాటే.

అరుళ్‌ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, మోడల్‌గానూ రాణించారు. ‘శరవణ స్టోర్స్‌’కు ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 2019లో అగ్ర కథానాయికలు తమన్నా, హన్సికలతో ఆయన రూపొందించిన ప్రచార చిత్రాలు విపరీతంగా ట్రెండ్‌ అయ్యాయి.

చిన్నప్పటి నుంచి నటించాలని కోరిక ఉన్నా.. వివిధ కారణాలతో అది నెరవేరలేదు. ప్రకటనల ద్వారా సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ రావడంతో ఎలాగైనా నటుడిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం చెన్నైలోని అడయార్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో కోర్సు కూడా పూర్తి చేశారు.

ది లెజెండ్‌ శరవణ స్టోర్స్‌ కంపెనీ పతాకంపై చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించారు. జె.డి.-జెర్రీ దర్శకత్వంలో, హ్యారిస్‌ జైరాజ్‌ సంగీత దర్శకుడిగా ఈ సినిమాను పట్టాలెక్కించారు. ఈ చిత్ర దర్శకులు జె.డి.జెర్రీలు అజిత్‌తో ‘ఉల్లాసం’ తీశారు.

మార్చి 3, 2022న ఈ సినిమాకు ‘ది లెజెండ్‌’ అనే టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఇందులో శరవణన్‌ శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌటెల ఇందులో కథానాయికగా నటించింది.

శరవణన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే, ఆయనకు సూర్యశ్రీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. 2017 జూన్‌లో సోదరి వివాహానికి రూ.13కోట్ల విలువైన దుస్తులు బహూకరించారు. అప్పట్లో చెన్నైలో ఈ వార్త సంచలనమైంది.

‘చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్‌పై ఆసక్తి ఉంది. కానీ మా లైఫ్‌స్టైల్, బిజినెస్‌ వేరు. బిజినెస్‌లో సక్సెస్‌ అయ్యా. ఇప్పుడు అవకాశం రావడంతో ఈ సినిమా చేశాను. నటనకు వయసు అనేది అడ్డంకి కాదని భావిస్తున్నాను’ అని శరవణన్‌ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version