HIT మూవీ రివ్యూ : విశ్వక్‌ సేన్‌ హిట్‌ కొట్టేశాడు.. హీరో నానికి లాభాల పంటే

-

చిత్రం : HIT
నటీనటులు : విశ్వక్సేన్, రుహానీ శర్మ తదితరులు
దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత : ప్రశాంతి తిరిపనేని
బ్యానర్ : వాల్ పోస్టర్ సినిమా
మ్యూజిక్ : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫి : మణికందన్
ఎడిటింగ్ : గ్యారీ బీహెచ్
రిలీజ్ డేట్ : 2020-02-28
రేటింగ్ : 3/5

టాలీవుడ్‌లో హీరోలు నిర్మాతలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో న్యాచురల్ స్టార్ నిర్మాతగా మారి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలను నిర్మిస్తున్నాడు. అందులో భాగంగా వచ్చిన అ! చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. మళ్లీ ఓ డిఫరెంట్ కథ, కథనాలతో నాని ఓ విభిన్న చిత్రాన్ని నిర్మించాడు. విశ్వక్‌సేన్‌ను HIT అనే చిత్రాన్ని నిర్మించాడు. మరి ఈ హిట్ సినిమా నిజంగానే హిట్ అయి నిర్మాతగా నానికి, హీరోగా విశ్వక్‌సేన్‌కు కలిసి వచ్చిందా? అన్నది ఓ సారి చూద్దాం.


కథ..

హైద్రాబాద్ మహానగరంలో అమ్మాయిల భద్రతల గురించి HIT (హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో విక్రమ్ ఇంటెలిజెంట్ ఆఫీసర్. అతను క్షణాల్లో ఎలాంటి కేసును పరిష్కరిస్తాడు. అలాంటి ఆయనకు ఓ గతం కూడా వెంటాడుతూ ఉంటుంది. ప్రీతి అనే అమ్మాయి అదృశ్యం అవ్వడం అదే సమయంలో విక్రమ్ ప్రేమించిన అమ్మాయి నేహా (రుహాని శర్మ)కూడా మిస్ అవుతుంది. ఈ రెండు కేసులను విక్రమ్ ఎలా చేదించాడు? వీటి వెనుకున్నది ఎవరు? చివరకు ఆ హంతకుడిని విక్రమ్ పట్టుకున్నాడా? లేదా అన్నదే HIT కథ.

నటీనటులు..

ఈ కథలో విక్రమ్ పాత్రలో విశ్వక్‌సేన్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల ఫలక్‌నుమాదాస్ యాంగిల్, యాటిట్యూడ్ కనిపించినా విక్రమ్ పాత్రకు ఉన్న ఇంటెన్సిటీలో కలిసిపోతుంది. ఓ వైపు గతం వెంటాడటం, మరో వైపు ప్రేమించిన అమ్మాయి అదృశ్యమవ్వడం ఇలా రెంటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రతీ సీన్‌లో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఈ కథలో రుహానీ శర్మ చేసిందేమీ లేదనిపిస్తుంది. అప్పడప్పుడు విక్రమ్ కలలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. కనిపించినంత సేపు తెరపై అందంగా ఉంది. ఇక ఇలాంటి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రతీ పాత్ర ఓ అనుమానాన్ని పుట్టించేలానే ఉంటుంది. అందుకే ఒకే సీన్‌లో కనిపించినా మంచి పేరే వస్తుంది. ఈ క్రమంలో రోహిత్ (చైతన్య), అభిలాష్ (శ్రీనాథ్), ఇబ్రహీమ్ (మురళీ శర్మ), షీలా (హరితేజ), స్వప్న( నవీనా రెడ్డి) ప్రతీ ఒక్కరూ చక్కని నటనను కనబరిచారు.

విశ్లేషణ..

క్రైమ్, థ్రిల్లర్ ఇలాంటి జానర్స్ తెలుగు ప్రేక్షకులకు కొత్త. మన స్టార్ దర్శకులు ఎవరూ ఇలాంటి వాటి జోలికి వెళ్లరు. ఎందుకంటే మనదంతా మాస్ మసాలా కమర్షియల్ ఫార్మాటే. అలాంటి చిత్రాలనే ఆదరిస్తారనే ఓ అపోహ. అందుకే పెద్ద దర్శకులెవరూ ఇలాంటి సాహసాలు చేయరు. అయితే కొత్తగా వస్తోన్న డైరెక్టర్స్ మాత్రం ఇలాంటి విభిన్న కథా చిత్రాలను ఎంచుకుని తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకుల పంథా కూడా మారుతోంది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రాలను ఆదరిస్తున్నారు. అందుకే ఓ ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మత్తువదలరా, బ్రోచేవారెవరురా వంటి చిత్రాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ఈ జాబితాలో చేరేందుకు తాజాగా వచ్చిన చిత్రమే HIT.

ఇద్దరమ్మాయిలు మిస్ అవ్వడం, అందులో ఒకరు హత్యకు గురి కావడం, ప్రతీ ఒక్కరిపై అనుమానం వచ్చేలా కథనం రాసుకోవడంలో దర్శకుడు శైలేష్ సక్సెస్ అయ్యాడనిపిస్తోంది. ప్రతీ సీన్‌లోనూ ఏదో తెలియని మ్యాజిక్ ఉండేలా చేయడంలో అతని ప్రతిభ కనిపిస్తుంది. ప్రేక్షకుడిని కట్టిపడేసేలా స్క్రీన్ ప్లే రాసుకోవడం, సీటు అంచునా కూర్చుని చూసేలా చేయడంతో HIT సూపర్ హిట్ అనిపించుకునేలా ఉంది. ఇలాంటి చిత్రాల్లో దర్శకుడి ప్రతిభే ఎక్కువగా కనిపిస్తుంది.. ఆ విషయంలో శైలేష్ వియం సాధించేశాడు.

ఇక ఈ సినిమాలో తరువాత చెప్పుకోవాల్సింది వివేక సాగర్ సంగీతం, నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎలివేట్ చేసేశాడు. మణికంధన్ సినిమాటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి. నిర్మాతగా నాని మరో హిట్ కొట్టినట్టే కనిపిస్తోంది.

బలం, బలహీనతలు..

ప్లస్ పాయింట్స్
నటీనటులు
కథ
కథనం
దర్శకత్వం
సంగీతం

మైనస్ పాయింట్స్

ఎంటర్టైన్‌మెంట్
అక్కడక్కడా కథనం తప్పినట్టు అనిపించడం

బాటమ్ లైన్.. సూపర్ HIT కొట్టేశారు..

Read more RELATED
Recommended to you

Latest news