విడాకులు తీసుకున్న బాలీవుడ్ ర్యాపర్ యో యో హనీసింగ్

బాలీవుడ్ ర్యాపర్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. తన భార్య షాలినీ తల్వార్ తో విడాకులు తీసుకున్నాడు. భరణంగా కోటి రూపాయల చెక్కును సీల్డ్ కవర్​లో పెట్టి ఫ్యామిలీ కోర్టుకు సమర్పించాడు. అనంతరం విచారణను 2023 మార్చి 22కు వాయిదా వేసింది కోర్టు. అయితే షాలిని మొదట రూ.10 కోట్లు డిమాండ్​ చేశారు. చర్చల అనంతరం కోటి రూపాయల భరణానికి ఇద్దరూ అంగీకరించారు.

హనీ సింగ్‌ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్టు, ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపిస్తూ అతడి భార్య శాలిని తల్వార్‌.. దిల్లీలోని తీస్‌ హజారీ కోర్టులో ‘గృహహింస నిరోధక చట్టం’ కింద గతేడాది పిటిషన్‌ దాఖలు చేశారు. సుమారు పదేళ్లపాటు ప్రేమలో ఉన్న హనీసింగ్‌-షాలిని.. 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే వివాహం అనంతరం వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

హనీసింగ్‌ 2014లో ‘ఇండియాస్‌ రా స్టార్‌’ అనే రియాలిటీ షోలో తన భార్య శాలినీ తల్వార్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీపికా పదుకొణె, సైఫ్‌ అలీఖాన్‌ నటించిన కాక్‌టెయిల్‌ చిత్రంలోని ఓ పాట హనీ సింగ్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు పనిచేశారు.