కాకినాడలో మరోసారి రేషన్ బియ్యం స్వాధీనం కలకలం రేపింది. 92 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని.. బియ్యాన్ని తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేశారు. సీపీ రాజశేఖర్ బాబు రేషన్ బియ్యం అక్రమ తరలింపు పై కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు. సీజ్ చేసిన బియ్యాన్ని గిడ్డంగికి తరలించామని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ ఏడాది జూన్ లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజుల పాటు అకస్మికంగా సోదాలు చేపట్టారు.
కాకినాడ యాంకరేజి పోర్టు, ఇతర ప్రాంగణాల్లోని 13 గోదాముల్లో తనిఖీలు నిర్వహించి 49,546 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 25,386 టన్నులు రేషన్ బియ్యంగా గుర్తించారు. జిల్లా కలెక్టర్ పోర్టులోకి వెల్లి సోదాలు చేసిన సందర్భంలోనూ 640 టన్నుల రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడ్డాయి. మరో 1064 టన్నులు పోర్టులోకి చేరాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంగర్ వేసిన స్టెల్లా ఎల్ నౌకలో 1320 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు.