మంచు కుటుంబం మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మంచు మనోజ్ తన సోదరుడు విష్ణుపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విష్ణు తన కారు ఎత్తుకెళ్లడమే కాకుండా తాను ఇంట్లో లేని సమయంలో 150 మందితో చొరబడి విధ్వంసం సృష్టించాడని ఆరోపించాడు. ఇక తాజాగా ఇవాళ మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో గేటు వద్దే బైఠాయించాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మనోజ్ విష్ణుపై ఆరోపణలు చేశాడు. తన సోదరుడు విష్ణు కెరీర్ కోసం తాను లేడీ గెటప్ కూడా వేసి సినిమా చేశానని అన్నాడు. తన కారును దొంగతనం చేశారని ఆరోపించాడు. తాను నటిస్తున్న ‘భైరవం’ సినిమాకు భయపడి ‘కన్నప్ప’ను పోస్ట్‌పోన్ చేసుకున్నాడని వ్యాఖ్యానించాడు. తాము ఇక్కడే ఉండొచ్చని హైకోర్టు నుంచి తనకు ఆర్డర్స్ వచ్చాయని.. పెద్దవాళ్లను పిలిచి కూర్చుని మాట్లాడదామని అడుగుతున్నానని మంచు మనోజ్ తెలిపాడు. ఈ వయసులో తన తల్లిదండ్రులకు ఈ గొడవలన్నీ అవసరం లేదని పేర్కొంటూ కూర్చొని సమస్యలు పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని మంచు విష్ణును కోరాడు మనోజ్.