‘హను మాన్’పై కన్నడ హీరోల ప్రశంసలు

-

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన సినిమా హనుమాన్. ఈ మూవీ జనవరి 12వ తేదీన విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ఊచకోత కోస్తోంది. ఈ ఏడాదిలో రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన తొలి తెలుగు సినిమాగా హనుమాన్ ఘనత సాధించింది. మరోవైపు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ఈ చిత్రం చూసిన సినీ సెలబ్రిటీలు కూడా ఈ మూవీపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హనుమాన్ టీమ్ను కన్నడ హీరోలు అభినందించారు.

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్ మూవీని వీక్షించారు. ‘‘ఈ చిత్రంలో తేజ సజ్జ బాగా నటించాడు. ఎంతో కష్టమైన సన్నివేశాలను కూడా సులువుగా చేశాడు. దర్శకుడి విజన్‌ మరోస్థాయిలో ఉంది. నటీనటులందరూ వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా అద్భుతం. చివరి 30 నిమిషాలు నాకు గూస్‌బంప్స్‌ వచ్చాయి. 2025లో రానున్న ‘జై హనుమాన్‌’ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని శివరాజ్‌కుమార్‌ అన్నారు.

మరోవైపు ‘‘హనుమాన్’ను ప్రశంసించేందుకు అందరితో పాటు నేనూ సిద్ధమయ్యాను. ప్రశాంత్‌ వర్మ కథను తెరకెక్కించిన విధానం, నిర్మాణ విలువలు ఈ స్థాయి విజయాన్ని అందించాయి. తేజ సజ్జ ఆకట్టుకున్నాడు’ అని ఎక్స్‌లో రిషబ్‌ శెట్టి పోస్టు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version