ఒక్కటంటే ఒక్క రూపాయి
నెలాఖరు రోజు జీవితాన్ని మార్చింది
ఆయన చెప్పిన డైలాగ్
అందరినీ అలరించింది
ఆ విధంగా ఇర్ఫాన్ ఖాన్ గుర్తు
ఏమీ లేని రోజు గుర్తు
ఆయన జీవితాన ప్రకాశితం అయిన వెలుగు
గొప్పది అంతకన్నా ఇప్పటి చీకటి ఇంకా గొప్పది
నిలుపుకోదగ్గ ప్రేమ నిలుపుకోదగ్గ దయ..మనలో ఉన్నప్పుడు లోకాలను ఖాళీ చేయడం కుదరని పని. ప్రేమ ఆస్తి అయినప్పుడు పంపకాలు ఎలా పూర్తికాకుండా పోతాయి. కనుక చావుతో పోరాటం చేసినప్పుడో బతుకులో అలసిసొలసి ఉన్పప్పుడో థియేట్రికల్ వర్డ్స్ ఏవో గుర్తుకువచ్చి ఉంటాయి.. నటులకు డ్రామా పండించడం సులువు.. తెర వెనుక ఆ నీడలను అలసి సొలసినప్పుడు ఊరడించడమే కష్టం..అని రాశాను ఇర్ఫాన్ కు నివాళిగా.. బొమ్మ బాబు వేశాడు. ఆనందించాను నేను.
అతడు దేశం గర్వించదగ్గ కళాకారుడు అవుతాడు. అలానే ఇర్ఫాన్ కూడా అయ్యాడు. ఇప్పుడిప్పుడే ఆ విధంగాపేరు తెచ్చుకోవాలని ఆశించి ప్రయత్నిస్తున్నారు. యశ్ కూడా డబ్బుల్లేని రోజు నెలాఖరు రోజు అనుభవించాడు. ఆ మాటకు వస్తే మన చిరు కూడా ! కనుక వైఫల్యాలను ప్రేమించడంలో ఉన్న ఆనందాలను మీరు గమనిస్తే విజయాలు అన్నవి ఏమీ కావు. సాధించాలి అని అనుకున్న రోజు గొప్పది. మిగతావన్నీ జీవితాన చాలా అంటే చాలా చిన్నవి.
ఇప్పుడంటే బాలీవుడ్ కు అసూయ కానీ ఒకప్పుడు ఇర్ఫాన్ ను చూసి టాలీవుడ్ కే అసూయ. అంత గొప్పగా ఇర్ఫాన్ అనే నటుడు ఈ లోకాన్ని శాసించి, ఈ రోజే అంటే సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ రోజే లోకాన్ని విడిచి వెళ్లాడు. ఏప్రిల్ 30,2020 నాటి విషాదాన్ని మళ్లీ తల్చుకోవడం బాధ్యత కావొచ్చు. లేదా కాలం చేసిన గాయాలను మోయడం కూడా కావొచ్చు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటులు అని చెప్పుకునేందుకు ఆస్కారం ఉన్న వాడు ఇర్ఫాన్. మనకు సైనికుడు అనే సినిమాలో మెరిశాడు. అంతకుముందు కూడా చాలా సినిమాలో ఉత్తరాదిలో మెరిశాడు. నటన తెలిసిన వాడు. బాగా నటించే సత్తా ఉన్నవాడు ఇర్ఫాన్.
ఇప్పుడెక్కడ ?
ఓ సందర్భంలో నటులు వేరు స్టార్లు వేరు అని చెప్పాడు నవాజుద్దీన్. ఇప్పుడాయన అంటే అంతా కోపంతో ఊగిపోవచ్చు. ప్యాన్ ఇండియా తగాదాల నేపథ్యంలో ఆయన స్పందించి, ఒక్క హిట్ పడితే అంతా సెట్ అయిపోద్ది అని అన్నారు. కానీ ఆయన చెప్పిన మాట ఎలా ఉన్నా ప్యాన్ ఇండియా అన్న పదం ఈ నెలాఖరు రోజు ఎందుకనో మింగుడు పడడం లేదు చాలా మందికి. ఓ సినిమా భారతీయ సినిమా అని అనిపించుకోవడంలోనే అర్థం ఉంది. ఇతను భారతీయ నటుడు అని చెప్పడంలో ఆనందం ఉంది. మనకు భారతీయ సినిమా ఒకప్పుడు బెంగాలీ సినిమా.. సత్యజిత్ రే సినిమా.
ఇప్పుడు హిందీ సినిమా.. ఇంకా ఆలోచిస్తే ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా భారతీయ సినిమా.. అని పేరు తెచ్చుకోవడం గర్వకారణం. ఆ విధంగా మన దగ్గరకు వచ్చి నటించి వెళ్లిన వాళ్లు మళ్లీ ఈ ఇండస్ట్రీ పై కామెంట్లు చేయడం వారి విజ్ఞత వదిలేయండి.. నెలాఖరు రోజు..జేబులో డబ్బుల్లేని రోజు.. అవి ఇర్ఫాన్ కు ఉన్నాయి. ఆయనతో పాటూ ఇప్పుడు ఇంకెందరికో ఉంటాయి కనుక డబ్బుల్లేని రోజు బాగుంటుంది. పేరూ కీర్తీ లేని రోజు ఇంకా బాగుంటుంది. మీరు వీటిపై శ్రద్ధ పెట్టండి ప్లీజ్ !
– రత్నకిశోర్ శంభుమహంతి
ఆర్ట్ : బాబు దుండ్రపెల్లి , భాగ్య నగరి