లతా మంగేష్కర్ తొలిపాట ఆ భాషలో పాడారు….!!

-

భారతీయ సినిమా పరిశ్రమలో తన ఆకట్టుకునే గాత్రంతో ఎన్నో పాటలు పాడి, ఎందరో అభిమానులను సంపాదించిన సింగర్ లతా మంగేష్కర్ గారు. ఇక గత కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆమెను ఇటీవల సౌత్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో జాయిన్ చేసారు కుటుంబసభ్యులు. నేడు ఆవిడ పరిస్థితి మరింత విషమించడంతో డాక్టర్లు ఆమెకు ఎంత మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆమే మనకు దక్కలేదు. ఆమె హఠాన్మరణ వార్త విన్న పలువురు సినిమా ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తెల్పడం జరిగింది.

చిన్నప్పటినుండి సంగీత కళపై ఎంతో మక్కువగల లతా మంగేష్కర్ గారు, తన తండ్రి దీనానాథ్ ప్రోత్సాహంతో సంగీతంలో శిక్షణ తీసుకుని, పెరిగి పెద్దయ్యాక సినిమా రంగప్రవేశం చేయడం జరిగింది. 1942లో ‘కితి హాసల్’ అనే మరాఠీ మూవీలో ‘నాచు యా గదే అనే సాంగ్’ ద్వారా ఆమె సినిమా రంగప్రవేశం చేసారు. అయితే అదే సంవత్సరంలో ఆమె తండ్రికి మంచి మిత్రుడైన వినాయక్ తన ‘పహిలి మంగళా గౌర్’ అనే సినిమాలో ఒక చిన్న వేషం ఇవ్వడంతో పాటు ఆ సినిమాలో ఆమెతో ఒక పాట కూడా పడించడం జరిగింది. ఆ తరువాత బాలీవుడ్ లో ప్రయత్నాలు ప్రారంభించిన ఆమెకు తొలిసారిగా ‘బడి మా’ అనే సినిమాలోని ‘జనని జన్మభూమి’ అనే పాటను పాడే అవకాశం దక్కింది.


అయితే ఆ పాటను మరికొందరు కో సింగెర్స్ తో కలసి పాడిన లతా గారు తన వినసొంపైన గానంతో ఆ సినిమా సంగీత దర్శకుడు కె దత్త ను ఎంతో ఆకట్టుకున్నారట. అలానే అదే సినిమాలో ‘మాత తేరే చరణో మే’ అనే పాటకు ఆమె కోరస్ పాడడం జరిగింది. ఆ విధంగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన లతా గారు, ఆ తరువాత హిందీ సహా మరాఠీ, తమిళ్, తెలుగు, కన్నడ, పంజాబీ, మలయాళం వంటి ఆరు రకాల భారతీయ భాషల్లో ఎన్నో గొప్ప పాటలను ఆలపించడం జరిగింది. అయితే ఎక్కువగా హిందీ పాటలు ఆలపించిన ఆమెకు ఆ తరువాత స్వర కోకిల అనే పేరు లభించింది.

ఇక మన తెలుగులో సంతానం, దొరికితే దొంగలు, ఆఖరిపోరాటం సినిమాల్లో ఆమె పాటలు పాడడం జరిగింది. ఇక అప్పట్లో ఆమె పాట ఎక్కడైనా వినపడితే చాలు, పనులు చేసుకునే వారు సైతం వాటిని ఆపి, ఆవిడ పాట విన్న తరువాతనే తమ పనిని చేసుకునే వారంటే, ఆమె గాత్రం ఎంత సుమధురంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక చివరిగా 2009లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘జైల్’ లో ‘దాత సున్ లే’ అనే పాట కు రెండు వెర్షన్స్ ని ఆమె ఆలపించడం జరిగింది. ఆ తరువాత తన ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటలు పాడడం ఆమె మానేశారు. ఇక నేడు హఠాత్తుగా మనల్ని విడిచి ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నిజంగా ఎంతో బాధాకరమైన విషయం.

ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం…..!!

ఇక ఆమె మృతి పట్లు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయ మరియు శ్రద్ధగల లతా దీదీ మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మన దేశంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చింది. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి ధీటుగా గుర్తుంచుకుంటాయి, ఆమె మధురమైన స్వరం ప్రజలను మంత్రముగ్ధులను చేయగల సామర్ధ్యం కలిగి వుందంటూ మోడీ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news