తమిళ నటుడు శివ కార్తికేయన్.. అంటే కొంతమందికి తెలియదేమో కానీ.. ‘రెమో’, ‘డాక్టర్’, ‘డాన్’ చిత్రాల హీరో అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు. ఇటీవల ఆయన తెలుగు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ప్రిన్స్ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక తాజాగా ఆయన మహావీరన్ అనే సినిమాతో సందడి చేశారు. అయితే ఈ సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మహావీరన్’ (తెలుగులో ‘మహావీరుడు’)కు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జులై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఆగస్టు 11 నుంచి తెలుగు, తమిళంలో ఇది అందుబాటులో ఉండనుంది. సినిమా లవర్స్.. ఇంకెందుకు ఆలస్యం.. అలా ఓటీటీలోకి రాగానే.. ఇలా సినిమా చూసేయండి మరి. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటో.. ఒక రెండు లైన్లలో అలా చెప్పుకుందామా..?
ఇదీ స్టోరీ.. సత్య (శివకార్తికేయన్) తన తల్లి (సరిత), చెల్లితో కలిసి ఓ బస్తీలో నివసిస్తుంటాడు. అతనొక కామిక్ ఆర్టిస్ట్. సత్య వేసిన మహావీరుడి బొమ్మల కథలు మా భూమి పత్రికలో సుబ్బారావు పేరుతో ప్రచురితం అవుతుంటాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్ల మహావీరుడి కామిక్ కథను మా భూమి పత్రిక అర్ధాంతరంగా ముగిస్తుంది. సామాన్యుల కోసం అధికార పార్టీ నిర్మించిన ప్రజాభవనంలో జరిగే ఘోరాన్ని ఆపే ధైర్యం లేకపోవడంతో తల్లి మాటల వల్ల కలత చెందిన సత్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అప్పుడే సత్య రాసిన మహావీరుడి కథలోని మాటలు పై నుంచి వినిపిస్తుంటాయి. ఆ మాటలు విన్న సత్య ఏం చేశాడు? పిరికివాడైన సత్య కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ప్రజాభవనంలోని ప్రజలను ఎలా కాపాడాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.