విజయవాడలోని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీవో నెంబర్ 107, 108 లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు హెల్త్ యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ వద్ద భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ముట్టడికి వచ్చిన విద్యార్థి సంఘాల నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
దీంతో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవో నెంబర్ 107, 108 జీవోల వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మెడికల్ కాలేజీల్లో ఈ జీవోలను తీసుకువచ్చిందని మండిపడుతున్నారు.