టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ హీరో మరో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించిన “షో టైమ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించాడు. స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.1 బ్యానర్ పై ఈ షో టైమ్ సినిమా తెరకెక్కనుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా అనిపిస్తోంది.

ఓ కుటుంబం అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భంలో ఓ పోలీసు అధికారి వారి ఇంటి ముందుకు వచ్చినట్లుగా అర్థమవుతోంది. దీంతో తమకు ఎదురైన ఇబ్బందుల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడిందనే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా ఈ పోస్టర్ సినిమాపై ఉత్కంఠతను రేపుతోంది. నవీన్ చంద్ర గతంలో పలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
కామాక్షి భాస్కర్ల కూడా మా ఊరి పొలిమేర సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ థ్రిల్లర్ సినిమా కూడా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. షో టైమ్ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ శరత్ కుమార్, సంభాషణలు శ్రీనివాస్ గవిరెడ్డి అందిస్తున్నారు. ప్రఖ్యాత ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్ఫణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.1 పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు.