స‌మంత‌పై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. ట్విట్ట‌ర్‌లో ఫ్యామిలీమ్యాన్ సిరీస్‌పై విమ‌ర్శ‌లు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌కు గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇప్పుడు వ‌రుస వివాదాలు ఎదుర‌వుతున్నాయి. ఆమె సినిమాలు చేసిన‌న్ని రోజులు ఒక్క‌టంటే ఒక్క వివాదం కూడా ఆమె ద‌రిచేర‌లేదు. కానీ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కార‌ణంగా ఆమె అభిమానులు, ప్ర‌భుత్వాల ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు. రాజ్ అండ్ డీకే క‌లిసి తీసిన ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ ట్రైల‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎన్నో అవాంత‌రాలు ఎదుర‌వుతున్నాయి.

 

దీన్ని ఆపాలంటూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఏకంగా సమాచార ప్రసార మంత్రికి అప్ప‌ట్లో లేఖ‌ను రాసింది. ఈ వెబ్ సిరీస్ లో శ్రీలంకలో ఈలం తమిళుల చారిత్రక పోరాటాన్ని వక్రీకరించారంటూ ఆరోపించింది. ఇందులో స‌మంత ఉగ్ర‌వాదిగా న‌టించ‌డం తమిళుల పై నేరుగా దాడి చేయడమేనని చెప్పింది.

ఇప్పుడు ఇదే ఫ్యామిలీమ్యాన్‌-2 వెబ్ సిరీస్‌పై ట్విట్ట‌ర్‌లో త‌మిళులు, సినీ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. #ShameonYouSamantha స‌మంత అనే యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి తీవ్ర ప‌ద‌జాలంతో కామెంట్లు పెడుతున్నారు. ఒక త‌మిళుల చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించే విధంగా వెబ్‌సిరీస్ తీశారంటూ మండిపడుతున్నారు నెటిజ‌న్లు. ఇప్పుడు ఈ యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. వేలాది కామెంట్లు స‌మంత‌కు వ్య‌తిరేకంగా వెలుస్తున్నాయి.