భారత్‌లో మే నెలలో కరోనా ఉగ్రరూపం దాల్చిన విషయం తెల్సిందే. రోజుకు దాదాపు నాలుగు లక్షల వరకు కేసులు, మూడు నుంచి నాలుగు వేల వరకు మరణాలతో దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. కరోనా దెబ్బకు కేంద్రం ప్రత్యేకంగా దేశంలో లాక్ డౌన్ విధించకపోయినా.. దాదాపు అన్ని రాష్ట్రాలు తమకు తామే లాక్ డౌన్ విధించుకున్నాయి. ఇక ఈ ఏడాది మే నెలలో దాదాపు 90.3 లక్షల కేసులు నమోదదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక నెలలో ప్రపంచంలోనే అత్యధికంగా నమోదైన కేసులు ఇవే కావడం గమనార్హం. ఈ గణాంకాలే మే నెలలో కరోనా తీవ్ర రూపానికి నిదర్శనం.
ఇక మే నెలలో దాదాపు 1.2 లక్షల మరణాల సంభవించగా… ప్రపంచంలోనే ఒక నెలలో నమోదైన అత్యధిక మరణాలు కూడా ఇవే. ఇక అమెరికాలో ఈ ఏడాది జనవరిలో 99,680 మరణాలు చోటుచేసుకోగా… ఈ రికార్డును భారత్ దాటేసింది. మేలో సంభవించిన మరణాలను పరిశీలిస్తే గంటకు దాదాపు 165 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అర్థమవుతోంది. ఇక మే 19న అత్యధికంగా 4,529 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా… ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాల్లో కూడా ఇదే ప్రపంచ రికార్డు.
దేశంలో తొలి కరోనా మరణం నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న మరణాల్లో కేవలం ఈ ఏడాది మే నెలలోనే మూడో వంతు అంటే 33 శాతం మరణాలు చోటుచేసుకున్నాయి. దీని బట్టి దేశంలో మే నెలలో కరోనా విలయతాండవానికి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క గతేడాది (2020)లో దేశంలో మొత్తం 1.48 లక్షల మరణాలు నమోదవగా… ఇక ఈ ఏడాది కేవలం ఏప్రిల్, మే నెలల్లో దాదాపు ఇంతే సంఖ్యలో మరణాలు సంభవించాయి. మొత్తానికి 2021 మేలో కరోనా ఉగ్రరూపానికి ఎన్నో కుటుంబాలు చిద్రమయ్యాయి.