ఆ విషయంలో మేజర్‌ దర్శకుడికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందేనట!

-

ఆర్మీ నేపథ్యంలో వచ్చి విజయం సాధించిన మేజర్ తెలుగు చిత్రాల్లో ఒక కొత్త పోకడకు నిదర్శనంగా మారిందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. పరుచూరి పాఠాలు ద్వారా అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ చిత్రంపై తనదైన విశ్లేషణ చేశారు. సాధారణంగా పోలీసు, ఆర్మీ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి ప్రత్యేక ఆదరణ ఉంటుందని ఆయన అన్నారు. వాటిలో ఆర్మీ కథలకు ఇంకొంచెం ప్రత్యేకత ఉన్నా, నేపథ్యమే పూర్తి కథ అయితే ఆ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలని లేదంటే నష్టపోకతప్పదని అభిప్రాయపడ్డారు. ఆ విషయంలో ప్రతిభ కనబర్చిన మేజర్‌ డైరెక్టర్‌ శశికిరణ్ తిక్కాను పరుచూరి అభినందించారు.

ఉత్కంఠ రేకెత్తించేలా దర్శకుడు మేజర్‌ను తీర్చిదిద్దారని, హీరోగా అడివి శేష్‌ అద్భుతంగా నటించారని ఆయన పేర్కొన్నారు. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో, సందర్భానుసారంగా వచ్చిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇచ్చాయన్నారు. ముఖ్యంగా ‘నా ప్రాణాన్ని తీసుకోగలవు కానీ, నా దేశాన్ని తీసుకోలేవు’ అనే సైనికుడి ప్రమాణాన్ని తెరపై అద్భుతంగా చూపడంలో దర్శకుడు కృతార్థుడయ్యాడని, ఆ విషయంలో హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందేనని పరుచూరి అన్నారు. ఇంకా హీరో తల్లిదండ్రులుగా ప్రకాష్‌రాజ్‌, రేవతిల నటనను పరుచూరి ప్రశంసించారు. కథకు అదనపు బలాన్ని అందించిన అబ్బూరి రవి సంభాషణలను ఆయన ప్రస్తావించారు.

కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమాలైనా విజయం సాధిస్తాయని ‘మేజర్‌’ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2008ముంబయి ఉగ్రదాడుల సమయంలో తాము గోవాలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి హాజరయ్యామని పరచూరి వెల్లడించారు. అప్పుడు ఉగ్రవాదుల ప్రభావం గోవాలో కూడా ఉంటుందేమో అని తాము భయపడిన సంగతిని పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version