బాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ మసాల యాడ్స్‌లో బిజీగా ఉండటం వల్లే హిందీ సినిమా తన ప్రాభవం కోల్పోతోందని ప్రముఖ హిందీ దర్శకుడు, నటుడు ప్రకాశ్ ఝా ఆరోపించారు. మిగతా ఇండస్ట్రీలు రూ.వందలకోట్లు ఖర్చు పెట్టి పాన్ ఇండియా సినిమాలను చిత్రీకరిస్తుంటే, బాలీవుడ్ అగ్ర హీరోలు మాత్రం పాన్ మసాల బ్రాండ్లను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారని ఆయన విమర్శించారు.
ప్రకాశ్ ఝా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మత్తో కీ సైకిల్’ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ ఝా మాట్లాడారు. ‘పెద్ద హీరోలతో సినిమాలు తీయకపోవడానికి కారణమేంటి?’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘వాళ్లకి కథలు వినే తీరిక లేదు. ఎందుకంటే వాళ్లంతా పాన్ మసాలాలను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఆ ఉత్పత్తులు ఎంతమంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనేది వారికి అనవసరం. ఒక్క యాడ్ చేస్తే ఆ రోజు సాయంత్రానికి రూ.50 కోట్లు వారి ఖాతాల్లో పడుతున్నాయి. ఇక వారికి కథ వినడంపై ఆసక్తి ఏముంటుంది? కంటెంట్ ఉన్న సినిమాలు ఎలా వస్తాయి. అందుకే పెద్ద హీరోలు నాతో సినిమాలు చేయట్లేదు’ అని అన్నారు.
బాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరైన ప్రకాష్ ఝా… మృత్యుదంద్, దిల్ క్యాకరే, గంగాజల్, అపహరణ్, రాజ్‌నీతి, సత్యాగ్రహ తదితర రాజకీయ నేపథ్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2020లో ఆశ్రం వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు 30కి పైగా సినిమాలను తెరకెక్కించారు. పలు చిత్రాలకు నేషనల్ అవార్డులు అందుకున్నారు. నిన్న విడుదలైన ‘మత్తో కీ సైకిల్’ కూడా బాక్సాఫీసు ఎదుట మంచి టాక్ అందుకుంటోంది.