నేడు లండన్‌లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌- 2 అంత్యక్రియలు

-

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలు పాటిస్తూ రాణికి ఇవాళ తుదివీడ్కోలు పలుకుతారు. రాణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వివిధ దేశాధినేతలు, రాజులు లండన్‌ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాణికి నివాళులు అర్పించనున్నారు.

సెప్టెంబర్ 8న రాణి ఎలిజబెత్-2 తుదిశ్వాస విడిచారు. 70 ఏళ్ల పాటు బ్రిటన్​ను పాలించిన ఆమె.. 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. పది రోజుల నుంచి యూకేలో సంతాప దినాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు రాణి భౌతికకాయాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చొని.. రాణికి తుది నివాళులు అర్పిస్తున్నారు.

వెస్ట్​మినిస్టర్‌ హాల్‌లో ఉంచిన రాణి శవపేటికను రాయల్‌ నేవికి చెందిన గన్‌ క్యారేజ్‌లో ఇవాళ వెస్ట్‌ మినిస్టర్‌ అబేకు తీసుకొస్తారు. అక్కడ వెస్ట్‌మినిస్టర్ డీన్ డేవిడ్ హోయల్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరుగుతాయి. కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ జస్టిన్ వెల్బీ.. సంతాప ప్రసంగాన్ని ఇస్తారు. బ్రిటన్‌ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ కూడా ప్రసంగించే అవకాశముంది.

వీరి ప్రసంగాలు పూర్తయిన తర్వాత రాణి శవపేటికను వెస్ట్‌ మినిస్టర్‌ అబే నుంచి లండన్ హైడ్ పార్క్ కార్నర్‌లోని వెల్లింగ్టన్ ఆర్చ్‌కు తీసుకొస్తారు. అక్కడి నుంచి విండ్సర్స్‌ క్యాజిల్‌కు అంతిమయాత్రగా తీసుకెళ్తారు. ఈ అంతిమ యాత్రలో కింగ్‌ ఛార్లెస్‌ 3తోపాటు రాజ కుటుంబం కూడా పాల్గొంటుంది. సెయింట్ జార్జ్ చాపెల్‌లోని కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్‌లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్ వాల్ట్‌లో రాణి శవపేటికను ఉంచుతారు. క్వీన్‌ ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ను ఉంచిన దగ్గరే రాణి శవపేటికను ఉంచుతారు.

Read more RELATED
Recommended to you

Latest news