విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో భారతీయుడు-2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య లైకా ప్రొడక్షన్స్ తో బడ్జెట్ విషయంలో వివాదాలు తలెత్తినప్పటికీ చివరికి శంకర్ రాజీకొచ్చారు. లైకా ఇచ్చిన బడ్జెట్ లో చేస్తానని ఓ మెట్టు దిగారు. దీంతో సినిమా మళ్లీ రీస్టార్ట్ చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. ఇందులో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ను కాకుండా మరో ఇద్దరు భామలను పరిశీలిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
దేశంలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. ముంబై నుంచి మోడల్స్ కి కొదవ లేదు. మరీ ఏరికోరి రకుల్ నే ఎందుకు ఎంపిక చేసారంటే? ఓ ఆసక్తికర విషయం లీకైంది. నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్ పెర్పామెన్స్ నచ్చడంతోనే శంకర్ ఆమెను ఎంపిక చేసారని ఓ తమిళ వెబ్ సైట్ రాసింది. అందులో రకుల్ బిలీయనీర్ జగపతిబాబు కుమార్తె పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తెరపై కనిపించినంత సేపు ఆ క్యారెక్టర్ చాలా ఆసక్తిగా ఉంటుంది. యాక్టింగ్ పరంగాను ఎంతో పరణితి చూపించింది. అందుకే శంకర్ భారతీయుడు-2కి ఎంపిక చేసారని పేర్కోంది. దీంతో రకుల్ జన్మ ధన్యం అయినట్లే. శంకర్ సినిమాలో ఛాన్స్ అంటే ఆసామాషీ కాదు. టెస్ట్ షూట్లు..ఆడిషన్లు టఫ్ గా సాగుతాయి. ఆయన సినిమాల్లో హీరోయిన్ అంటే రేర్ క్వాలిటీస్ ఉండాలి.
అన్నింటిని స్డడీ చేసిన తర్వాత శంకర్ ఛాన్స్ ఇస్తాడు. ఆ రకంగా రకుల్ అన్నిరకాలుగా శంకర్ ను మెప్పించే ఉంటుంది. కారణాలు ఏవైనా రకుల్ కెరీర్ చివరి దశలో ఇది పెద్ద అవకాశమే. ఇప్పటికే ఆమెకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తెలుగులో మన్మధుడు -2 మినహా మరో ఛాన్స్ లేదు. బాలీవుడ్ లో ఒక హిందీ, కోలీవుడ్ లో ఒక సినిమా చేస్తోంది. ఇంతలో శంకర్ ఆఫర్ తో షాకిచ్చాడు. అయితే ఈ విషయాలు అధికారికంగా యూనిట్ రకుల్ ధృవీకరించాల్సి ఉంది.