థియేటర్లు తెరిస్తే వైరస్ మరింతగా ప్రబలుతుందని, ఇప్పట్లో థియేటర్లు రీ ఓపెన్ చేయడం కష్టమని నిన్న మొన్నటి వరకు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అన్‌లాక్ -5లో భాగంగా కేంద్రం థియేటర్లని, మల్టీప్లెక్స్‌లని అక్టోబర్ 15 నుంచి రీ ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం మార్గ దర్శకాలని విడుదల చేసింది. దీంతో థియేటర్లలో ఎవరు అడ్డు వచ్చినా కరోనా వైరస్ మరితంగా ప్రబలేలా చేస్తానంటున్నారు రామ్ గోపాల్ వర్మ.
రామ్‌గోపాల్ వర్మ నిర్మాణంలో అగస్త్య మంజు రూపొందిస్తున్న చిత్రం `కరోనా వైరస్`. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. లాక్‌డౌన్ తరువాత థియేటర్లలో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా ఈ సినిమాని వర్మ అభివర్ణించారు. `ఎట్టకేలకు ఈ నెల 15వ తేదీ నుంచి థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. సంతోషం. లాక్‌డౌన్ తరువాత విడుదలవుతున్న తొలి చిత్రంగా `కరోనా వైరస్` నిలవనుంది. లాక్‌డౌన్ సమయంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. లాక్‌డౌన్ వల్ల ఓ కుటుంబం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది అన్నది ఈ చిత్రంలో చూపించాం` అని వర్మ వెల్లడించారు.