యంగ్ హీరో శర్వానంద్ నటించిన రణరంగం సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో యంగ్ హీరో అడవి శేష్ నటించిన ఎవరు సినిమాకు పోటీగా బాక్సాఫీస్ రణరంగంలోకి దిగింది. శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శని జంటగా నటించిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. టేకింగ్ పరంగా, ట్రీట్మెంట్ పరంగా మంచి మార్కులే ఉన్నా కొత్త కథకు రొటీన్ పూత పూసేశారంటూ విమర్శకులు తేల్చేశారు.
ఇక హీరోగా చేసిన శర్వానంద్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఎవరు సినిమాతో పోలిస్తే ప్రమోషన్లు చేయకపోవడంతో సినిమాకు ప్రి రిలీజ్‌బజ్ కూడా అనుకున్నట్టుగా లేదు. మరోవైపు అడవి శేష్ ఎవరు ముందు రోజే ప్రీమియర్లు వేయడం… హిట్ టాక్ రావడం ఆ సినిమాకు కలిసొచ్చింది. ఇటు రణరంగంకు కనీసం సోషల్ మీడియా హంగామా కూడా లేకపోవడం కూడా మైనస్ అయ్యింది.
ఇక తొలి రోజు రణరంగం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 3.8 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాకు రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సినిమాకు జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్‌తో కంపేరిజన్ చేస్తే ఈ సినిమాకు వచ్చిన ఫస్ట్ డే వసూళ్లు తక్కువే అని చెప్పాలి. మరోవైపు ఎవరు బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. మల్టీఫ్లెక్స్‌లతో పాటు బీ, సీ సెంటర్లలో కూడా ఆ సినిమాకు ప్రేక్షకాదారణ ఉంది. శుక్రవారం నుంచి ఎవరుతో పోటీ తట్టుకుని రణరంగం ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.