దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి అరెస్టయిన కన్నడ నటి రన్యారావు కేసులో తవ్వుతున్న కొద్ది డొంక కదులుతోంది. ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆమె హవాలా డబ్బు వినియోగించినట్లు డీఆర్ఐ విచారణలో తేలింది. నటి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా డీఆర్‌ఐ తమ విచారణలో తేలిన విషయాలను న్యాయస్థానానికి తెలిపింది.
ఈ నేపథ్యంలో బంగారం కొనేందుకు తాను హవాలా డబ్బు వాడినట్లు స్వయంగా రన్యారావు అంగీకరించినట్లు డీఆర్‌ఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో మరో నిందితుడు తరుణ్‌రాజ్‌కు ఆమె ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. ఆమె పంపిన డబ్బుతోనే అతడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాడని .. ఈ ఇద్దరూ బ్యాంకాక్, జెనీవాకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవారని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. హోటల్ వ్యాపారి తరుణ్‌రాజ్, రన్యారావు స్నేహితులని.. వీరిద్దరూ 2023లో దుబాయ్‌లో విరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్‌ఎల్‌సీ (LLC) అనే ట్రేడింగ్ కంపెనీని స్థాపించారని కోర్టుకు వివరించారు.