తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రోజున పొడి వాతావరణం నెలకొంటుందని అధికారులు తెలిపారు. రేపటి నుంచి 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పనులన్నీ ఉదయం పూటే చేసుకోవాలని.. మధ్యాహ్నం వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని చెప్పారు.
ఇక మంగళవారం రోజున తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్ లో అత్యధికంగా 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. భద్రాచలం 38 డిగ్రీలు.. నిజామాబాద్ 37.3, ఖమ్మం 36.6 డిగ్రీలు, నల్గొండ 36, హైదరాబాద్ 33.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది. రేపు పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మధ్యాహ్నం పూట అత్యవసర పనులపై బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తలపై టోపీ లేదా ఏదైనా వస్త్రం కట్టుకోవాలని చెప్పారు. వడదెబ్బ తగలకుండా తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలని తెలిపారు. బయటకు వెళ్లే వారు తప్పకుండా వెంట నీళ్లసీసా తీసుకెళ్లాలని చెప్పారు.