తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో రుణమాఫీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేవుళ్లపై ఒట్టేసి మరీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీలో అడిగితే ప్రతిదాడులు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వాన్ని బయట ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెడుతున్నారని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు లేకపోతే..HMDAలో రూ.20వేల కోట్లతో టెండర్లు ఎలా పిలుస్తున్నారని నిలదీశారు. రేవంత్ అత్తగారిల్లు, ఆయన భూములున్న ఆమన్‌గల్‌కు రూ.5వేల కోట్లతో రోడ్డు ఎలా వేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.