ఉమ్మడి కడప జిల్లాలో పదోతరగతి ప్రశ్నపత్రం లీక్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ముగ్గురుని సస్పెండ్ చేసిన డీఈవోపై నిందితులు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ కేసులో డీఈవో షంషుద్దీన్.. చీఫ్ సూపరింటెండెంట్ ఎం.రామ కృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ అధికారి ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఇన్విజిలేటర్ ఎం.రమణలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో డీఈవోపై పలువురు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు, విచారణ వంటి వాటిపై తాము రాజకీయంగా చూసుకుంటామంటూ బెదిరించినట్లు సమాచారం. ఇంతటితో విద్యాశాఖ సైలెంట్ అవ్వాలని లేకపోతే జిల్లా విద్యాశాఖ అధికారులే లక్ష్యంగా చర్యలు చేపట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
ఇటీవల పదో తరగతి విద్యార్థులకు గణితం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ వైరల్ అయింది. ఈ ఫొటోను ఓ వ్యక్తి డీఈవో షంషుద్దీన్ కు పంపగా ఆయన క్యూ ఆర్ కోడ్ ఆధారంగా ఎక్కడి నుంచి పేపర్ లీక్ అయిందో గుర్తించారు. వల్లూరు మండలంలో ఒకటి, వేంపల్లె మండలంలోని రెండు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల అండతో ఈ ఘటన చోటుచేసుకుందని నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురిని డీఈవో సస్పెండ్ చేశారు.