పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరం అయితే.. రేవతి భర్త భాస్కర్ కి ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు దిల్ రాజు.
రేవతి కూతురు బాధ్యతను తాము తీసుకుంటామని ప్రకటించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం.. తరువాత జరగాల్సిన వాటిపై చర్చిస్తామని తెలిపారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరారు. సంధ్య థియేటర్ లో ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. సాధారణంగా ఘటనలు జరగాలని ఎవ్వరూ కోరుకోరని తెలిపారు. అలాగే ప్రజలకు మీడియా కూడా వాస్తవాలు చూపించాలని కోరారు. త్వరలోనే అల్లు అర్జున్ ని కలుస్తానని.. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత ఎఫ్డీసీ చైర్మన్ గా నాకు బాధ్యత ఉందన్నారు.