ఆస్కార్- 2023లో పోటీ పడే అవకాశం గుజరాతీ సినిమా ‘చలో షో’కు దక్కింది. ఈ చిత్రం ఆస్కార్‌కు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో నామినేట్ అయినట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రకటనపై ఛల్లో షో చిత్ర దర్శకుడు నలిన్ పాన్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్ ఎంట్రీకి తమ చిత్రం నామినేట్ చేసినందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఈ ఏడాది భారత్ నుంచి ఎంపికయ్యే అవకాశం ఉన్న చిత్రమంటూ ఆర్‌ఆర్‌ఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. పలు ఇంగ్లీష్ మ్యాగజైన్స్ సైతం ఫలానా కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్ పోటీ పడే ఛాన్స్ ఉందని రాసుకొచ్చాయి. ప్రస్తుతం ఆ అవకాశం లేనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర విభాగాల అవార్డులకు ఎంపికైన సినిమాల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇదీ కథ..: బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్‌కు ఎంపికైన ఈ సినిమా దర్శకుడు నలిన్ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కింది. చిన్న తనంలో ఆయన సినిమాలకు ఎలా ఆకర్షితులయ్యారు? వెండితెర, సినిమా పై ఎంత మమకారం పెంచుకున్నారు? తదితర హృదయాలను హత్తుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. గుజరాత్ రాష్ట్రంలోని గ్రామీణ వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో నలిన్ కళ్ల కట్టినట్టు చూపించారు. తొమ్మిదేళ్ల బాలుడి కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్ రావల్, పరేశ్ మెహతా ప్రధాన పాత్రలు పోషించారు. లాస్ట్ ఫిల్మ్ షో (ఆంగ్లంలో)పేరుతో ఈ సినిమా గతేడాది జూన్‌లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై, వీక్షకుల హృదయాల్ని బరువెక్కించింది. పలు అంతర్జాతీయ వేడుకల్లోనూ సత్తా చాటింది. అక్టోబరు 14న భారత్‌లో విడుదలకాబోతుంది.
⭐ Not #RRR
⭐ Not #TheKashmirFiles…
⭐ #LastFilmShow [#ChhelloShow] is #India's official entry to the #Oscars… OFFICIAL POSTER… pic.twitter.com/uiWUSCAtB3— taran adarsh (@taran_adarsh) September 20, 2022
ఆస్కార్ పోటీలో నిలిచిన మన చిత్రాలు.. 1958లో మదర్ ఇండియా, 1989లో సలామ్ బాంబే, 2001లో లగాన్ ఆస్కార్ పోటీలో నిలిచాయి. ఇప్పటి వరకూ ఈ మూడు భారతీయ సినిమాలు ఆయా ఏడాదిలో ఆస్కార్ అవార్డుల్లో గట్టి పోటీనిచ్చి, తుది జాబితాలో నిలిచాయి. తమిళ చిత్రం ‘కూలంగళ్’ (పెబెల్స్) గతేడాది ఆస్కార్‌కు నామినేట్ అయినా షార్ట్‌లిస్ట్‌లో నిలవలేకపోయింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లో మార్చి 12న వచ్చే ఏడాది జరగనుంది.
జనరల్ కేటగిరీలో… ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ కాని, చిత్రాలు జనరల్ కేటగిరిలో పోటీ చేయొచ్చు. దాని కోసం ఆయా చిత్ర బృందాలు తమ సినిమా నామినేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ అక్టోబరు 3 వరకూ అవకాశం ఉంది. 2022లో విడుదలైన (జనవరి 1 నుంచి నవంబరు 30 వరకు) చిత్రాలకు వెసులుబాటు ఉంది. ఆయా సినిమాలు థియేటర్లలో కనీసం ఏడు రోజులు ప్రదర్శితమై ఉండాలి.