Aparna Balamurali : హీరోయిన్ చేయి పట్టి లాగిన స్టూడెంట్.. తీవ్రంగా ఫైర్ అయిన బ్యూటీ

-

‘సూరారై పోట్రు’ తెలుగులో ఆకాశమే నీ హద్దు రా పేరుతో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా బాలమురళీకి ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. ఓ కళాశాల ఈవెంట్‌లో పాల్గొన్న ఆమెతో ఓ స్టూడెంట్‌ అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.  ఈ ఘటనపై నటి అపర్ణ స్పందించారు.

ఈ ఘటన తనని ఎంతగానో బాధించిందని అపర్ణ వాపోయారు. ‘అదొక తీవ్రమైన చర్య. న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమన్న విషయం అర్థం చేసుకోలేరా? బలవంతంగా నా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరైన పద్ధతి కాదు. అంతేకాకుండా అతని చేతులు నా భుజాలపై వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళపట్ల ప్రవర్తించాల్సిన తీరు కాదిది’ అని అన్నారు.

ఈ ఘటనపై తానేమీ పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని అపర్ణా బాలమురళీ తెలిపారు. ఫిర్యాదు చేసి, దాని వెనుక పరిగెత్తే సమయం తనకు లేదన్నారు. సదరు విద్యార్థి చేసిన చర్యను తాను ఖండిస్తున్నానని అన్నారు. ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణ చెప్పారని ఆమెను వివరించారు.

మరోవైపు  అపర్ణ పట్ల అనుచితంగా ప్రవర్తించిన యువకుడిని కళాశాల యాజమాన్యం సస్పెండ్‌ చేసింది.  కళాశాల యూనియన్‌.. నటికి క్షమాపణలు చెబుతూ ఓ లేఖను విడుదల చేసింది. ‘‘లా కళాశాలలోని ఓ కార్యక్రమానికి హాజరైన నటికి ఇలాంటి సంఘటన ఎదురుకావడం నిజంగా దురదృష్టకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే యూనియన్‌ అధికారి ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆమెకు ఇబ్బంది కలిగేలా చేసినందుకు మరోసారి క్షమాపణలు తెలుపుతున్నాం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, సదరు విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొంది.

తన తదుపరి చిత్రం ‘తన్కమ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా సహనటుడు వినీత్‌ శ్రీనివాసన్‌తో కలిసి అపర్ణా బాలమురళీ కేరళలోని ఓ లా కాలేజీలో సందడి చేశారు. అపర్ణ స్టేజ్‌పై కూర్చొని ఉండగా.. ఓ విద్యార్థి అక్కడికి చేరుకుని ఆమెకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. అనంతరం కుర్చీలో కూర్చొన్న ఆమె చేయి పట్టుకుని పైకి లాగాడు. దీంతో చేసిదిలేక ఆమె నిల్చొగానే.. ఆ యువకుడు భుజంపై చేయి వేయబోయాడు. యువకుడి అనుచిత ప్రవర్తనకు కంగుతిన్న ఆమె.. అతడి నుంచి దూరంగా జరిగింది. దీనికి సంబంధించి వీడియో ఒకటి బయటకు రాగా.. నెటిజన్లు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version