వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్’ . ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా వినోదం పంచింది. అయితే ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆహా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘‘మాస్టర్ హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి మన ఇంటికి వస్తున్నాడు. రెడీగా ఉండండి’’ అని క్యాప్షన ఇచ్చింది.
ఇదీ సుందరం మాస్టర్ స్టోరీ సుందరం మాస్టర్ (హర్ష) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా ఎమ్మెల్యే (హర్షవర్ధన్)కి మిర్యాల మెట్ట నుంచి ఓ ఉత్తరం అందుతుంది. ఆ గ్రామస్థులకు ఇంగ్లిష్ టీచర్ కావాలనేది దాని సారాంశం. బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ ఊరికి వెళ్లి ఇంగ్లిష్ పాఠాలు చెప్పే బాధ్యతని తీసుకుంటాడు సుందరం మాస్టర్. బయటివాళ్లకి ఎవ్వరికీ ప్రవేశం లేని ఆ ఊళ్లో విలువైన వస్తువు ఏదో ఉందనీ, దాన్ని కనిపెట్టే బాధ్యతని కూడా సుందరం మాస్టర్‌కి అప్పజెప్పి అది కనిపెడితే డీఈఓ పోస్ట్ కూడా ఇస్తానని మాటిస్తాడు ఎమ్మెల్యే. డీఈఓ అయితే ఇంకా ఎక్కువ కట్నం వస్తుందనే ఆశతో ఆ ఊరికి బయల్దేరతాడు సుందరం. తీరా అక్కడికెళితే ఊళ్లో అందరూ మాస్టర్ కన్నా బాగా ఇంగ్లిష్‌లో మాట్లాడతారు. ‘అసలు నీకే ఇంగ్లిష్ రాదు’ అంటూ ఆ టీచర్‌కు పరీక్ష పెడతారు. ఆ టెస్ట్‌లో ఫెయిల్ అయితే ఉరేస్తాం అని హెచ్చరిస్తారు. మరి ఆ పరీక్షలో సుందరం మాస్టర్ పాసయ్యాడా? ఊళ్లో విలువైన వస్తువుని సుందరం కనిపెట్టాడా? ఇంతకీ ఆ ఊరి వెనకున్న చరిత్ర ఏమిటి?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.