‘ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో అసభ్యకర వ్యాఖ్యల విషయంలో యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా తీవ్ర విమర్శలతోపాటు కేసునూ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయం కాస్త సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ముంబయి, గువాహటి, జైపుర్‌లలో అతడిపై నమోదైన కేసులపై అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ..ఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
మరోవైపు అతడి పాస్‌పోర్ట్‌ను రిలీజ్ చేయడానికి నిరాకరించింది. ఈ కేసులో దర్యాప్తు ముగిసిన తర్వాత పాస్‌పోస్ట్ రిలీజ్ చేయాలనే పిటిషన్‌ను పరిశీలిస్తామని సర్వోన్నత న్యాస్థానం తెలిపింది. పోలీసులకు తన పాస్‌పోర్టు సరెండర్ చేయాలని కోర్టు గతంలో చేసిన ఆదేశాలను సవరించాలని కోరుతూ అల్హాబాదియా కోర్టును ఆశ్రయించాడు. అయినా సుప్రీంకోర్టు పాస్ పోర్ట్ రిలీజ్ చేసేందుకు నిరాకరించింది.
ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా తల్లిదండ్రుల శృంగారం పై అసభ్యకరంగా మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి కామెంట్స్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది.