సినీ దర్శకుడు బాలాజీకి మద్రాసు హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి డీ3 సినిమాను ఓటీటీలో విడుదల చేసినందుకు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజిన్ హీరోగా బాలాజీ దర్శకత్వం వహించిన డీ3 సినిమాను బి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, జేకేఎం ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించగా.. గతేడాది మార్చిలో విడుదలైంది. అయితే ఈ సినిమాను నిర్మించేందుకు సామువేల్ గాడ్సన్ వద్ద రూ.4 కోట్లు తీసుకున్న నిర్మాత మనోజ్.. 60 శాతం సినిమా హక్కులను సామువేల్‌కి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమాను విడుదల చేశారని తెలుపుతూ సామువేల్ గాడ్సన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డీ3 సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు నిషేధం విధించింది. అంతే కాకుండా సినిమా ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను దాఖలు చేయాలని ఆదేశించింది. కానీ ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి ఓటీటీలో సినిమాను విడుదల చేశారని డైరెక్టర్ బాలాజీ, నిర్మాత మనోజ్‌లపై సామువేల్ గాడ్సన్ కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. బాలాజీకి నెల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.