ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, బాబీ సింహాలకు స్టాలిన్ సర్కార్ షాక్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాల కేసుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. కొడైకెనాల్ మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా రెండు భవనాల నిర్మాణ పనులను నిలిపివేసినట్లు న్యాయస్థానానికి తమిళనాడు సర్కారు తెలిపింది. ఇద్దరిపైనా న్యాయ పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. ప్రభుత్వ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు- ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై తీసుకున్న చర్యలకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే.. కొడైకెనాల్లోని విలాపట్టి పంచాయతీలో అనుమతి లేకుండా భవనాల నిర్మాణాలు చేపట్టారని బాబీ సింహా, ప్రకాశ్ రాజ్లపై హైకోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నిర్మాణాల్లో భాగంగా కొండల నుంచి రాళ్లు తొలగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇందుకోసం భారీ యంత్ర సామగ్రిని ఉపయోగిస్తున్నారని ఇది ఇప్పటికే ఉన్న నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.