టాలీవుడ్ నటుడు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని.. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్ చేసిన అనంతరం తారకరత్న ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశముందని చెప్పారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. మరోవైపు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వద్ద అభిమానులు, సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు అధికారులను బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు.
తారకరత్నకు కుప్పంలో యాంజియోప్లాస్టీ తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు.