సిక్కిం వరదల్లో అలనాటి తెలుగు నటి గల్లంతు.. ఆందోళనలో కుటుంబం

-

సిక్కింలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఇప్పటికే 20కి పైగా మంది గల్లంతయ్యారు. ఇందులో ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు. వరదలతో ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు ఈ వరదల్లో తెలుగు సినీపరిశ్రమలకు చెందిన అలనాటి నటి ఒకరు గల్లంతయినట్లు తాజాగా తెలుస్తోంది. ఆమెను కనిపెట్టాలంటూ అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె తెలంగాణ సర్కార్​ను అభ్యర్థించారు. ఇంతకీ ఆ నటి ఎవరంటే..?

తెలుగు సినీ పరిశ్రమలో దాన వీర శూరకర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన అలనాటి తార సరళ కుమారి.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అక్టోబరు 2వ తేదీన ఆమె తన మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. తన ఫ్రెండ్స్​తో సిక్కిం పర్యటనకు వెళ్తున్నట్లు సరళ.. అమెరికాలో ఉంటున్న తన కుమార్తెకు సమాచారం అందించారు. అక్కడ స్థానికంగా ఉన్న ఓ హోటల్లో బస చేసినట్లు కూడా చెప్పారు. అయితే ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత సరళ కుమారి ఆచూకీ గల్లంతయ్యింది.

రెండు మూడ్రోజులుగా తన తల్లి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె కుమార్తె ఆరా తీయగా.. అక్కడ వరదలు సంభవించిన విషయం తెలిసింది. ఆ వరదల్లో తన తల్లి గల్లంతయ్యారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన తల్లి ఆచూకీ కనిపెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్టోబరు 3న చివరిసారిగా తన అమ్మతో మాట్లాడానని..  వార్తల్లో వరదల గురించి తెలుసుకున్నానని.. ఆర్మీ హాట్‌లైన్‌ నంబర్లకు ప్రయత్నించినా అవి పనిచేయడం లేదని.. దయచేసి మా అమ్మను కనిపెట్టండి అని కోరారు

Read more RELATED
Recommended to you

Latest news