తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల త్రిష-మన్సూర్ అలీఖాన్ వివాదం తెగ రచ్చ అవుతున్న విషయం తెలిసిందే. త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు ఆమెకు క్షమాపణ చెప్పాడు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన మన్సూర్ కామెంట్స్ వీడియో కాస్త జాతీయ మహిళా కమిషన్ వద్దకు చేరింది. దీన్ని సుమోటోగా విచారణకు తీసుకున్న కమిషన్ మన్సూర్‌పై చర్యలు చేపట్టాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో థౌజండ్ లైట్ ఆల్ ఉమెన్ పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు చేశారు. సమన్లు పంపడంతో ఆయన పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తునకు హాజరయ్యారు. అయితే మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు చేపట్టొద్దని నటి త్రిష కోరింది. ఈ నేపథ్యంలో అతడి వ్యాఖ్యలపై త్రిష తరఫున రాతపూర్వక వివరణ కోరుతూ పోలీసులు లేఖ పంపారు. మన్సూర్ అలీఖాన్ క్షమాపణ చెప్పడంతో ఆయనపై తదుపరి చర్యలు చేపట్టొద్దని త్రిష తరఫున జవాబు అందినట్లు పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.