ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా విజయం తరువాత అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇక గత కొంతకాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న పూరి, ఛార్మి తాజాగా చిత్ర షూటింగ్ మొదలు పెట్టేశారు. అయితే ఈ సినిమాకి ముందుగా ‘ఫైటర్’ అనే టైటిల్ ను అనుకున్నారు.
ఆ తరువాతనే ఈ ప్రాజెక్టులోకి కరణ్ జొహార్ వచ్చి చేరడం, తెలుగుతోపాటు ఈ సినిమాను హిందీలోను విడుదల చేయాలనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టైటిల్ మార్చే అవకాశం ఉందనే టాక్ వచ్చింది. కథా పరంగా ఈ సినిమాకి ‘లైగర్’ అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో కరణ్ – పూరి వున్నారని సమాచారం. మగ సింహానికీ .. ఆడపులికి పుట్టిన పిల్లను ‘లైగర్’ అంటారు. కథాపరంగా ఈ టైటిల్ అయితే బాగుంటుందని భావించి సెట్ చేశారని అంటున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే పరిచయమవుతోంది.