విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ మీకోసం..

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సరసన ఇజా బెల్లె, క్యాథరీన్ థెరెసా, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా గోపి సుందర్ మ్యూజిక్ ని అందించాడు. ఇక ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత మేర అంచనాలు అందుకుందో చూద్దాం.

కథ :

ముందుగా కథ విషయానికి వస్తే తమ కాలేజ్ రోజుల నుంచి గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశి ఖన్నా) ప్రేమించుకుంటారు. అయితే సరైన ఉద్యోగం లేకుండా ఉన్న గౌతమ్ కు ఒక డ్రీమ్ ఉంటుంది. అతడు దానిని సాధించడానికి యామిని కొంత సపోర్ట్ చేస్తుంది. ఇక ఆ తరువాత కొన్ని కారణాల వలన వారిద్దరూ విడిపోతారు. మరోవైపు శీనయ్య, సీత అనే ఇద్దరు మధ్య తరగతి భార్యాభర్తల జీవనం సాగుతూ ఉంటుంది.శీనయ్య ఇల్లందులో సింగరేణి కార్మికుడు. ఇక వారితో పాటు కథలోకి (స్మిత) క్యాథెరిన్, ఇజబెల్ (ఇజా బెల్లె) రావడం, అసలు వారికి గౌతమ్, శీనయ్యలకు ఉన్న సంబంధం ఏమిటి, అలానే ఈ గౌతమ్, శీనయ్యలు ఇద్దరా లేక ఒకరా, అసలు గౌతమ్ డ్రీమ్ ఏంటి, అతడు దానిని సాధించాడా లేదా అనేవి తెలియాలంటే మాత్రం ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

విశ్లేషణ :

నిజానికి విజయ్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా రొమాంటిక్‌, ఎమోషనల్ డ్రామా గా సాగుతుంది అనే చెప్పాలి. ఇక ముఖ్యంగా కథ విషయమై ప్రేమకు సంబంధించి ఒక డిఫరెంట్ ప్లాట్ ని ఎంచుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్, దానిని స్క్రీన్ పై చూపించడంలో మాత్రం చాలావరకు తడబడ్డాడు. ముఖ్యంగా సినిమాలోని హీరో ప్లే బాయ్ క్యారెక్టర్ లో నలుగురు హీరోయిన్లకు ఉన్న సంబంధాన్ని ఎలివేట్ చేసే సమయంలో ఆయన రాసుకున్న సీన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువ కావడంతో ప్రేక్షకుడికి కథ విషయమై కొంత అయోమయానికి గురయ్యే అవకాశముంది.

ఇక హీరో పాత్ర యొక్క ఔచిత్యం, అతడి భావాలు గురించి ఎంతో గొప్పగా చూపించిన దర్శకుడు, వాటిని స్క్రీన్ పై ప్రెజంట్ చేయడంలో మాత్రం విఫలం అయ్యాడు. అలానే అక్కడక్కడా అర్జున్ రెడ్డి ఛాయలు రిపీట్ అయ్యాయని ప్రేక్షకులు అంటున్నారు. ఇక విజయ్ నాలుగు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో ఎంతో బాగా నటించాడని, అలానే హీరోయిన్ రాశి ఖన్నా, మరొక హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌లు ఈ సినిమాకు మంచి బలం. క్యాథరీన్, ఇజా బెల్లె కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. ఫస్ట్ హాఫ్ బాగానే సాగిన ఈ సినిమా, సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా చోట్ల ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు క్రాంతి మాధవ్ సినిమా స్క్రీన్ ప్లే విషయమై చాలా చోట్ల అయోమయపడ్డాడు. ఇక సినిమాలో విజువల్స్ బాగున్నాయని, అయితే పాటలు మాత్రం అసలేమాత్రం గుర్తుండే ఛాన్సే లేదు. కేవలం లవ్ ఫీల్ తో సాగే ఈ సినిమాలో వినోదం లేకపోవడం కూడా మెజారిటీ ప్రేక్షకులకు సినిమా చేరువ కాలేకపోయింది. నాలుగు ప్రేమకథలలో ఇల్లందు భార్యాభర్తల కథ చాలావరకు నేచురల్‌గా ఉండి, ప్రేక్షకులను కట్టిపడేసింది.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ దేవరకొండ యాక్టింగ్

రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్

అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్

 

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

బ్యాక్ ఎపిసోడ్స్

ఆకట్టుకోని స్క్రీన్ ప్లే

ఎంటర్టైన్మెంట్ లేకపోవడం

 

తీర్పు :

ఇక మొత్తంగా ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా విజయ్ ఖాతాలో మరొక ఫ్లాప్ గా మిగిలే అవకాశాలే ఎక్కువ. అయితే లవ్ థీమ్ తో సాగే సినిమా కాబట్టి, కొంతవరకు యువత కనుక సినిమాకు కనెక్టు అయితే, యావరేజ్ వరకు నిలబడవచ్చు. దర్శకుడు కథనాన్ని నడపడంలో తడబడడం, అలానే స్క్రీన్ ప్లే ని ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేయలేకపోవడం, ఏ మాత్రం అలరించలేని సాంగ్స్, అలానే కేవలం ఎమోషనల్ గా సాగే కథ వల్ల ఎక్కడా వినోదం అనేది లేకపోవడం వంటివి ఈ సినిమాకు చాలా వరకు నష్టం కలిగించే అంశాలు. అయితే అక్కడక్కడ కొన్ని పాయిట్స్ మాత్రం యువతను ఆకట్టుకుంటాయి. మంచి ఫ్యాన్సీ రేట్లకే అమ్ముడుపోయినా, రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో అనేదానిని బట్టి దేవరకొండ విజయ్‌సాయి మార్కెట్‌ నిర్ణయించబడుతుంది.

 

రేటింగ్ : 2. 5 / 5