వహీదా రెహమాన్.. బాలీవుడ్లో ఈ పేరు ఓ సెన్సేషన్. తన నటనతో.. డ్యాన్స్‌తో ప్రేక్షకులను మైమరిపించిన ఈ నటి తాజాగా ఓ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే. ఆ అవార్డుకు వహీదా రెహమాన్‌ను ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందజేయనున్నట్లు వెల్లడించారు.
వహీదా.. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ సినిమాల్లో నటిగా రాణించారు. 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించిన వహీదాకు చిన్నప్పటి నుంచే నాట్యం అంటే ఇష్టం. అలా నాట్యం నేర్చుకుంటూనే 1955లో ఎన్టీఆర్ సొంత సంస్థలో తెరకెక్కిన ‘జయసింహ’ అనే సినిమాలో రాజకుమారి పాత్రకు వహీదా ఎంపికయ్యారట. అంతకుముందు ‘రోజులు మారాయి’ అనే సినిమాలో ఏరువాక సాగాలో అంటూ సాగే పాపులర్ సాంగ్‌లో డ్యాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇక దేవ్ ఆనంద్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘CID’ సినిమాతో ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ‘ప్యాసా’, ‘గైడ్’, ‘కాగజ్ కే ఫూల్’, ‘ఖామోషి’, ‘త్రిశూల్’ వంటి చిత్రాల్లో నటించి బీటౌన్‌లో సెటిలైపోయారు. అలా తన ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 90కి పైగా చిత్రాల్లో వహీదా నటించారు. నేషనల్ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు.