కంగన, ఊర్మిళ మధ్య వార్‌ మళ్లీ మొదలైందా !

బాలీవుడ్‌ డేరింగ్ అండ్ డ్యాషింగ్ నటి కంగనా రౌనత్ ఎప్పుడూ ఏదో అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నటి ఊర్మిళపై ఆమె చేసిన ట్వీట్లతో మళ్లీ కంగన, ఊర్మిళ మధ్య వార్‌ మొదలైందా అన్న చర్చ నడుస్తుంది.

కాంగ్రెస్‌ నుంచి శివసేనలో చేరిన కొద్దిరోజులకే ఊర్మిళ 3 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారంటూ కంగనా ట్వీట్ చేసింది. అంతేకాదు ఊర్మిళకు చురకలు అంటిస్తూ తన బాధనంతా ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చింది కంగనా. “ఊర్మిళాజీ.. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇళ్లను కాంగ్రెస్‌ కూల్చి వేయించింది. బీజేపీని మెప్పించడంతో నా మీద 30 కేసులు నమోదయ్యాయి. మీరు మీ తెలివితేటలతో కాంగ్రెస్‌ను సంతోష పరుస్తున్నారు… నేను కూడా మీలా తెలివితో ప్రవర్తించి ఉండాల్సింది..అయ్యో నేను ఎంత తెలివితక్కువదాన్నో కదా? అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది కంగనా.

కంగన చేసిన వ్యాఖ్యలను ఊర్మిళ వెంటనే రిప్లై ఇచ్చారు. తాను ఎవరి దయాదాక్షిణాలతోనూ ఇల్లు కొనుగోలు చేయలేదన్నారు. సినీ పరిశ్రమలో పాతికేళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఫ్లాట్‌ కొన్నానని చెప్పుకొచ్చారు ఊర్మిళ. రాజకీయాల్లోకి రాకముందే.. 2011లోనే దాన్ని కొనుగోలు చేశానన్నారు. దానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని చెప్పింది ఊర్మిళ. అంతేకాదండోయ్.. కంగనాకు సవాల్ కూడా విసిరింది. “ఏయ్ కంగనా.. ప్లేస్ నువ్వే చెప్పు.. అక్కడికే వచ్చి ప్లాట్‌కు సంబంధించిన డ్యాక్స్ మెంట్స్ చూపిస్తా” అంటూ సవాల్‌ విసిరింది ఊర్మిళ. ప్రజలు కట్టిన కోట్లాది పన్నుల ద్వారా నీవు వై క్యాటగిరీ భద్రతను ఎంజాయ్ చేస్తున్నావంటూ కంగనాపై మండిపడింది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా రౌనత్.. రంగీలా భామ ఊర్మిళ మధ్య ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. వీరిద్దరి మధ్య గతంలోనూ సోషల్ మీడియా వేదికగా మాటల వార్ నడిచింది. సుశాంత్ ఆత్మాహత్య తర్వాత బాలీవుడ్ లో బంధు ప్రీతి ఉంది అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో ఊర్మిళా మండి పడింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నవారి పేర్లు తనకు తెలుసంటూ కంగన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఊర్మిళ.. ఆ జాబితాను పోలీసులకు అందజేయాలంటూ చురకలు అంటించింది.