భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో టెలివిజన్ చర్చలు జరపాలనుకుంటున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. రెండు రోజుల రష్యా పర్యటనకు ముందు ఓ వార్త సంస్థకు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించగలిగితే భారత ఉపఖండంలోని కోట్లాది జనాభాకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉగ్రవాదం, కశ్మీర్ ఇతర సమస్యల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్న విషయం తెలిసినదే.
పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తే చర్చలు జరుపుతామని భారత్ చెప్పింది. ఉగ్రవాదం, చర్చలు ఒకదానితో ఒకటి కలిసి సాగలేవని తేల్చిచెప్పింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మారడంతో వాణిజ్యం కూడా తగ్గిపోయిందన్నారు. మరొక వైపు ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందించారు. పాక్‌కు రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలున్నాయని, వాటిని బలోపేతం చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఆర్థిక సహకారం కోసం రష్యా పర్యటనకు వెళ్లనున్నారు ఇమ్రాన్. దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఒక పాకిస్తానీ నాయకుడు రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.