మొహర్రం స్పెష‌ల్‌: త్యాగానికి ప్ర‌తీక మొహ‌ర్రం

-

మ‌హ్మ‌దీయుల ప్ర‌ధాన ప‌ర్వ‌దినాల్లో మొహ‌ర్రం ఒక‌టి. హ‌స‌న్‌, హుసైన్ అనే ముస్లిం వీరుల స్మార‌కార్థం శోక‌త‌ప్త హృద‌యాల‌తో జ‌రుపుకునే కార్య‌క్ర‌మ‌మే పీర్ల పండుగ‌.. ఇస్లాంలో పీర్ అంటే ధ‌ర్మ‌ప‌రిక్ష‌కుడు, గొప్ప‌వాడు అని అర్థం. మొహ‌ర్రం పేరు విన‌గానే నిప్పుల గుండాలు, పీరీలు, గుండెలు బాదుకుంటూ మాతం చ‌ద‌వ‌డాలు గుర్తుకొస్తాయి. ఇస్లాం పంచాంగం ప్ర‌కారం అర‌బ్‌లో నూత‌న సంవ‌త్స‌రం ప్రా రంభ‌మ‌య్యే రోజును ముస్లింలు మొహ‌ర్రంగా జ‌రుపుకోవ‌డం ఆచారంగా వ‌స్తోంది. ప్రాచీన కాలంలో అ ర‌బ్బులు (అరేబియాలోని యూదులు, క్రైస్త‌వుల‌తో స‌హా) ఈ కాలెండ‌ర్‌ను అనుస‌రించేవారు. మొహ‌ర్రం మాసంలో ప‌దోతేదీని ఆషురా దినంగా జ‌రుపుకుంటారు. ఈ రోజును అనేక సంప్ర‌దాయ గుర్తుల‌కు, త‌మ పూర్వీకుల జ్ఞాప‌కార్థంగా పండుగ‌లా నిర్వ‌హించుకుంటారు.


వాస్త‌వానికి మొహ‌ర్రం ప‌ర్వ‌దినంగా పేరు పొందిన‌ప్ప‌టికీ… అది ప‌దిరోజుల విషాద దిన‌మే త‌ప్ప‌..ఎంత‌మాత్రం పండుగ కాదు. చారిత్ర‌క ఆధారాల ప్ర‌కారం .. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌కు ఇమామ్ హ‌స‌న్‌, ఇమామ్ హుసైన్ అనే ఇద్ద‌రు మ‌నువ‌లు ఉండేవారు. క్రీశ 630వ సంవ‌త్స‌రంలో మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త ప‌ర‌మ‌ప‌దించిన త‌ర్వాత ఆయ‌న మ‌న‌వ‌డు ఇమామ్ హ‌స‌న్‌ను త‌మ ప్ర‌తినిధిగా ప్ర‌జ‌లు ఎన్నుకుంటారు. ఇది అప్ప‌టి సిరియా గ‌వ‌ర్న‌ర్ మావియాకు న‌చ్చ‌దు. క‌త్తితోనే రాజ్యాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని కుట్ర‌ప‌న్ని, ఇమామ్ హ‌స‌న్‌పై యుద్ధం ప్ర‌క‌టిస్తాడు.  యుద్ధంలో పాల్గొంటే అమాయ‌క ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతార‌ని గ్ర‌హించి, హ‌స‌న్ ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టిన ప‌ద‌విని వ‌దులుకుంటాడు.  దీంతో రాజ్యాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్న మావియా.. అంత‌టితో ఆగ‌కుండా విష‌ప్ర‌యోగంతో హ‌స‌న్‌ను హ‌త‌మారుస్తాడు.

నిరంకుశంగా మావియా త‌న కుమారుడైన య‌జీద్‌ను రాజ్యాధికారిగా నియ‌మిస్తాడు. అయితే ముస్లిం ధ‌ర్మ‌శాస్త్రాన్ని అనుస‌రించి సంప్ర‌దింపులే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు అని భావించిన ఇమామ్‌ హుసైన్ చ‌ర్చ‌ల కోసం రాజ‌ధాని కుఫాకు బ‌య‌లుదేరుతాడు. విష‌యం తెలిసిన య‌జీద్ త‌న ప‌రివారాన్ని పంపి, హుసైన్‌ను దారి మ‌ధ్య‌లోనే అడ్డ‌గిస్తాడు. య‌జీద్ రాజును అంగీక‌రించాల‌ని, లేదంటే యుద్దానికి సిద్ధ‌మ‌వ్వాల‌ని సైన్యాధ్య‌క్షుడు హుసైన్ ను హెచ్చ‌రిస్తాడు. దీంతో చేసేదేమీలేక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో హుసైన్ యుద్ధ రంగంలోకి దిగుతాడు. ప‌ది రోజుల పాటు హోరాహోరీగా సాగిన యుద్ధంలో హుసైన్ కుటుంబ స‌భ్యులంతా నేల‌కొరుగుతారు. ఆ త‌ర్వాత య‌జీద్ సైన్యం చివ‌రికి ఇమామ్ హుసైన్‌ను కూడా వెన్నుపోటు పొడిచి చంపుతారు.

ఈక్ర‌మంలోనే హ‌స‌న్‌, హుసైన్ కు నివాళిగా.. వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ముస్లింలు ఈ ప‌ది రోజులు మొహ‌ర్రం వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. తెలుగు రాష్ఠ్రాల్లో .. మ‌రీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహ‌ర్రం పండుగ‌ను అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌తాల‌క‌తీతంగా జ‌రుపుకోవ‌డం విశేషం. ఈ ఆచారం వంద‌ల ఏళ్లుగా కొన‌సాగుతోంది. మొహ‌ర్రం నెల‌ను ష‌హీద్ నెల ( అమ‌ర‌వీరుల )గా వ‌ర్ణిస్తూ, ఒక పండుగ‌లా కాకుండా , వ‌ర్ధంతిగా జ‌రుపుకోవ‌డం ఆచారంగా వ‌స్తోంది. వంద‌ల ఏళ్ల కింద‌టే హైద‌రాబాద్ న‌గ‌రంలో ముస్లిం దేశాల‌కంటే గొప్ప‌గా మొహ‌ర్రంను నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. పాత బ‌స్తీలోని యువ‌కులు త‌మ‌ను తాము హింసించుకుంటూ.. ఊరేగింపు నిర్వ‌హించ‌డం ఆచారం గా కొన‌సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news