తెలుగు మాసాలు ప్రకృతితో మమైకమవుతాయి. రుతువుల ఆధారంగా, నక్షత్ర గమనాల ఆధారంగా మాసాలు పెట్టారు మన పూర్వీకులు. తెలుగు నెలల్లో నాలోగో నెల ఆషాడం. సరిగ్గా ఇది ఎండల నుంచి రుతుపవనాలు వచ్చే సమయంలో వస్తుంది. ఈ మాసానికి అనేక ప్రత్యేకతలు వాటి గురించి తెలుసుకుందాం…
జూన్ 22 నుంచి జూలై 20 వరకు ఈ సారి ఆషాఢ మాసం.
పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడం లో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు .
ఆషాఢమాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాడం మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనం లో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.
ఈ మాసం లోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు.
ఆషాడ సప్తమి ని భాను సప్తమి గా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిమనానం గా ఉంటాయి. ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుండి చాతుర్మాస వ్రతంఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు.
-శ్రీ