ప్రతివారు దేవుని పూజిస్తారు. ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పిస్తారు. కోరికలు కోరుకుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ఎక్కువమంది భక్తులు దేవుళ్లకు సమర్పించే నైవేద్యం అరటి పండ్లు. కొబ్బరికాయ తదితరాలు. అయితే ఆయా పండ్లు నైవేద్యంగా పెడితే చాలా రకాలుగా కోరికలు నెరవేరుతాయని వాటికి సంబంధించి విషయాలను పండితులు పేర్కొన్నవి తెలుసుకుందాం…
అరటి పండు గుజ్జు నైవేద్యంగా పెట్టడం ద్వారా అప్పుల బాధ తొలగిపోతుంది. రావలసిన డబ్బు తిరిగి వస్తుంది. నష్టపోయిన నగదును పొందే అవకాశం, రాదనుకున్న నగదు తిరిగి రావటం, ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ కట్టినా తిరిగి వస్తుంది.
శుభకార్యాలకు కావలసిన నగదు సకాలంలో చేతికి అందుతుంది. అదేవిధంగా చాలా కాలంగా ఆగిపోయి ముందుకు సాగని పనులు పూర్తికావాలంటే చిన్న అరటి (యాలక్కి అరటి) నైవేద్యంగా సమర్పిస్తే త్వరగా పూర్తవుతాయట. కమలాపండును నైవేద్యంగా సమర్పిస్తే పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాలతో పనులను ఆపేస్తే ఆ పనులు పూర్తవుతాయి.
పూర్ణఫలం లేక కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే పనులు త్వరగా, సులభంగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. ఇక సపోటా పండును నైవేద్యంగా పెడితే, అమ్మాయిని చూసి వెళ్లినవారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా లేదా సంబంధం చేసుకునేందుకు నిరాకరించినా, ఇతరుల మధ్యవర్తిత్వం ద్వారా ప్రయత్నించినా అబ్బాయి తరపు వారు నిరాకరిస్తే, సపోటాపండును దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలైనా తొలగిపోతాయి. ఇక పై సమస్యలు ఏవైనా ఉంటే ఆయా నైవేద్యాలను భక్తితో దేవునికి సమర్పించి శ్రీఘంగా అనుకూల ఫలితాలను పొందండి.
– కేశవ