తిరుపతిలో నిన్న రాత్రి తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాజీ సీఎం జగన్ రుయా, స్విమ్స్ ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఘటన జరగడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబుతో సహా అందరూ బాధ్యులేనని వెల్లడించారు. ప్రతీ సంవత్సరం జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా ఎందుకు సరైన ఏర్పాట్లు చేయలేదని ప్రభుత్వం పై మండిపడ్డారు.
దీనికి సీఎం నుంచి టీటీడీ చైర్మన్, ఈవో, ఎస్పీ, కలెక్టర్ అందరూ బాధ్యులేనని ధ్వజమెత్తారు. మేము అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ తరపున చేసిన పనులను ప్రజలు ఈరోజుకి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ నేడు కనీసం తిండి, నీరు కూడా లేని పరిస్థితి నెలకొంది అని తెలిపారు. వ్యవస్థ అత్యంత దారుణంగా ఉందన్నారు. చనిపోయిన వారికి కనీసం రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచిత వైద్యంతో పాటు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.