కాణిపాకం ఆల‌యం గురించి మీకు తెలియని విశేషాలివే..!

-

కాణిపాకంలో వినాయ‌కుడి విగ్ర‌హం బావిలోనే ఉంటుంది. అయితే ఆ బావిలోని నీరు ఎప్ప‌టికీ ఎండిపోదు. దీంతో ఆ బావి నీటిని ప‌ర‌మ ప‌విత్రంగా భావించి భ‌క్తుల‌కు తీర్థంగా అందిస్తారు.

మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా తిరుమ‌ల‌కు ఎంతో పేరు ఉంది. అక్క‌డ కొలువై ఉన్న వెంక‌టేశ్వ‌రున్ని పూజిస్తే స‌క‌ల దోషాలు పోతాయ‌ని, అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ని, కోరిన కోర్కెలు నెర‌వేరుతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు. అయితే తిరుప‌తికి వెళ్లే చాలా మంది ద‌ర్శించుకునే ప్రాంతాల్లో కాణిపాకం కూడా ఒక‌టి.

 తిరుమ‌ల వెంక‌న్న దేవుడికి ఎంత పేరు ఉందో కాణిపాకం వినాయ‌కుడికి కూడా అంతే పేరుంది. ఈ క్ర‌మంలోనే కాణిపాక ఆల‌య విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాణిపాకంలో వినాయ‌కున్ని ఎవ‌రూ ప్ర‌తిష్టించ‌లేదు. ఆయన ఇక్క‌డ స్వ‌యంభువుగా వెలిశాడ‌ని చ‌రిత్ర చెబుతోంది. అందులో భాగంగానే ఓ క‌థ కూడా ఇక్క‌డ ప్ర‌చారంలో ఉంది.. అదేమిటంటే.. ఒక‌ప్పుడు ఒక గ్రామంలో మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారి వ్య‌వ‌సాయ భూమిలో ఎప్పుడూ పంట‌లు బాగా పండేవి. అయితే ఒక‌సారి వారి వ్య‌వ‌సాయ భూమిలో ఉండే బావిలో నీరు ఎండిపోతుండ‌డాన్ని వారు గ‌మ‌నించారు. దీంతో వారు ఆ బావిని కొంత తవ్వితే నీరు వ‌స్తుంద‌ని భావించి వెంట‌నే ఆ బావిని తవ్వ‌డం మొద‌లు పెట్టారు. అలా వారు కొంత త‌వ్వ‌గానే ఓ రాయి త‌గులుంది. దీంతో ఆ బావినిండా ర‌క్తం ఊరుతుంటుంది. క్ర‌మ క్ర‌మంగా ఆ బావి ర‌క్తంతో నిండుతుంటుంది. అయితే అదే స‌మ‌యంలో వారికి బావిలో వినాయ‌కుడి విగ్ర‌హం కనిపిస్తుంది. దీంతో వారు త‌వ్వ‌డం ఆపి విగ్ర‌హాన్ని పూజిస్తారు. ఈ క్ర‌మంలో వెంట‌నే వారికి ఉన్న వైక‌ల్యాలు పోయి వారు మామూలు మ‌నుషులుగా మారుతారు.

అలా ఆ విష‌యం ఆ గ్రామంలోని ఇత‌ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస్తుంది. దీంతో వారు కూడా వినాయ‌కున్ని పూజించ‌డం మొద‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలో వారు స్వామి వారికి కొట్టే కొబ్బ‌రికాయ‌ల నుంచి వ‌చ్చే నీరు ఆ గ్రామం అంతా వ్యాపిస్తుంది. దీంతో వారి పంట‌లు ప‌చ్చగా పండుతాయి. గ్రామం సుభిక్షంగా మారుతుంది. అలా వ్య‌వ‌సాయ భూముల్లో నీరు ప్ర‌వ‌హించే స‌రికి ఆ గ్రామం కాణిపాకం అయింది. కాగా కాణిపాకం ఆల‌యాన్ని 11వ శ‌తాబ్దంలో చోళ రాజులు నిర్మించార‌ని చ‌రిత్ర చెబుతోంది.

కాణిపాకంలో వినాయ‌కుడి విగ్ర‌హానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే.. స్వామి వారి విగ్ర‌హం రోజూ కొంత ప‌రిమాణం పెరుగుతుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అందుకు సాక్ష్యం ఆయ‌న‌కు ధ‌రించే తొడుగులే. ఒక‌ప్పుడు భ‌క్తులు ఆయ‌న విగ్ర‌హానికి చేయించిన తొడుగులు ఇప్పుడు స‌రిపోవ‌డం లేదు. విగ్ర‌హం సైజు పెరిగింది. కావాలంటే భ‌క్తులు ఆలయంలో ఉండే స్వామి వారి తొడుగుల‌ను చూడ‌వ‌చ్చు. అవే ఆయన విగ్ర‌హం పెరుగుతుంద‌న‌డానికి సాక్ష్యాలు..! ఇక స్వామి వారి విగ్ర‌హానికి 50 సంవ‌త్స‌రాల కింద‌ట చేయించిన వెండి క‌వ‌చం కూడా ఇప్పుడు స‌రిపోవ‌డం లేద‌ట‌. ఈ ఒక్క ఆధారం చాలు.. ఆయ‌న విగ్రహం ప‌రిమాణం పెరుగుతుంద‌ని చెప్ప‌డానికి..!

కాణిపాకంలో వినాయ‌కుడి విగ్ర‌హం బావిలోనే ఉంటుంది. అయితే ఆ బావిలోని నీరు ఎప్ప‌టికీ ఎండిపోదు. దీంతో ఆ బావి నీటిని ప‌ర‌మ ప‌విత్రంగా భావించి భ‌క్తుల‌కు తీర్థంగా అందిస్తారు. అలాగే కాణిపాక వినాయ‌కుడికి స‌త్యానికి మారు పేరు అనే మ‌రో గుర్తింపు కూడా ఉంది. చాలా మంది త‌ప్పులు చేసిన వారిని ఇక్క‌డికి తీసుకువచ్చి ఆల‌యం ఎదుట ఉన్న కోనేట్లో స్నానం చేయిస్తే వారు తాము చేసిన త‌ప్పుల‌ను ఒప్పుకుంటార‌ని భ‌క్తుల విశ్వాసం. అలాగే ఆల‌య ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంటుంది. అందులో స్వామి వారి వాహ‌న‌మైన ఎలుక ఉంటుంద‌ట‌. దానికి ఇష్ట‌మైన ఏదైనా ప‌దార్థం వేసి స్వామి వారిని ప్రార్థిస్తే అనుకున్నవి జ‌రుగుతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు.

కాణిపాకం ఆల‌యంలో ఎప్పుడూ ఒక పాము తిరుగుతుంటుంద‌ట‌. అది ఎవ‌రికీ అప‌కారం చేయ‌ద‌ట‌. అది దేవ‌తా సర్ప‌మ‌ని భ‌క్తులు న‌మ్ముతారు. ఇక కాణిపాకం ఆల‌యానికి వెళ్లాలంటే.. తిరుప‌తి నుంచి ప్ర‌తి 15 నిమిషాల‌కు ఒక బ‌స్సు ఉంటుంది. అదే చిత్తూరు నుంచి అయితే ప్ర‌తి 10 నిమిషాల‌కు ఒక బ‌స్సు ఉంటుంది. చంద్ర‌గిరి నుంచి కూడా భ‌క్తులు వెళ్ల‌వ‌చ్చు. అక్క‌డి నుంచి ప్రైవేటు వాహ‌నాలు బాగా ల‌భిస్తాయి. కాణిపాక క్షేత్రం చిత్తూరుకు 11 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అదే తిరుప‌తి నుంచి అయితే కాణిపాకంకు సుమారుగా 68 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version