కార్తీకంలో ఇలా చేస్తే అష్ట ఐశ్యర్యాలు ప్రాప్తి!!

-

మాసాలలో కార్తీకానికి ఉన్న ప్రత్యేకత మరే మాసానికి లేదంటే అతిశయోక్తి లేదు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే. అయినప్పటికీ వీటిలో కొన్ని రోజులు మరీ ముఖ్యమైనవని పండితుల అభిప్రాయం. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. 2019లో అక్టోబర్‌ 29 నుంచి ఈ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం భక్తులు పూజలు చేస్తుంటారు.

హరిహరాదులకు ప్రీతికరం… కృత్తిక నక్షత్రంలో పూర్ణిమ వచ్చినందున దీన్ని కార్తీకమాసం అంటారు. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా నిర్వహిస్తారు. ఇలా విశేషార్చనలు నిర్వహించడం వల్ల భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ”ఆశుతోషుడు” అనే బిరుదు వచ్చింది.

ఉపవాసం,స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, తెల్ల జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు. వ్రతం చేసుకునే అవకాశం లేకుంటే కనీసం ఎక్కడైనా వ్రతం చేస్తుంటే చూసి కథ విని, ప్రసాదం తీసుకున్నా సరిపోతుంది. భక్తి, శ్రద్ధ ముఖ్యం.

ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభిం చే పుణ్యఫలాన్ని వర్ణిం చడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహారణలను బట్టి తెలుసుకోవచ్చు.
తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవ దూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెను ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.

దీపారాధన చేస్తే కలిగే ఫలాలు!
కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీలు దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్దిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం. దేవాలయాల్లో కార్తీక దీపాలను వెలిగించడం, ఆకాశదీపాలను చూసి ప్రదక్షణలు చేస్తే మంచిది. సాధ్యమైనన్ని సార్లు ప్రతిరోజు శివపంచాక్షరీని మనస్సులో మననం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version