తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మాజీ సీఎం కేసీఆర్ కనీసం చూసేందుకు కూడా వెళ్లలేదని విమర్శించారు. టెక్స్ టైల్ వర్సిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని గుర్తు చేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా ఆయన పేరు పెట్టనున్నట్టు వెల్లడించారు.
రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తామని తెలిపారు. తనను ఆశీర్వదించిన కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నా.. గుండెల్లో పెట్టుకున్న మీ రుణం తీర్చుకుంటానన్నారు. నేతన్నలకు ప్రభుత్వం ఆర్డర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండొద్దని భావించాను. అందుకే మహిళా సంఘాల్లోని వారికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. రూ.1.30కోట్ల చీరలు నేసే ఆర్డర్లను రాష్ట్ర నేతన్నలకు ఇస్తున్నట్టు తెలిపారు. మండల్ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం.