సాక్షాత్తూ పరమశివుడే ఈ గుహకు కాపలా ఉంటాడని స్థల పురాణం చెబుతోంది. ఆలయం గుహ ముఖ ద్వారం నుంచి సుమారుగా 100 అడుగుల లోతుకు కిందకు వెళితే గర్భాలయం.
మన దేశంలో వినాయకుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కొన్ని మానవ నిర్మితాలు కాగా, కొన్ని స్వయంభువుగా వెలసినవి. వాటిని తిరిగి అప్పట్లో కొందరు పునర్నిర్మించారు. అయితే చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన ఎన్నో వినాయకుడి ఆలయాలకు ఒక్కో దానికి ఒక్కో స్థల పురాణం ఉంటుంది. ఈ క్రమంలో వేటికవే ఒక్కో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఆలయం మాత్రం వినాయకుడికి చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే.. పరమశివుడు నరికిన వినాయకుడి తల ఈ ఆలయంలోనే ఇప్పటికీ ఉందట. ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఆలయ స్థల పురాణమే ఆ విషయాన్ని మనకు తెలియజేస్తోంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉందంటే…
ఉత్తరాఖండ్‌లోని పితోరాగడ్ ప్రాంతం గంగోలిహట్ నుంచి సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ అనే గ్రామం ఉంటుంది. అక్కడే పాతాళ భువనేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇందులో భక్తులు వినాయకుడు, ఆయన తండ్రి శివున్ని పూజిస్తారు. అయితే ఈ ఆలయంలోకి వెళ్లాలంటే సుమారుగా 100 అడుగుల లోతు, 160 మీటర్ల పొడవు ఉన్న గుహలోకి కిందకు భక్తులు వెళ్లాలి. చాలా మంది ఈ గుహలోకి వెళ్తుంటే కలిగే భయానికి వెనక్కి వచ్చేస్తారు. ఇక లోపలి దాకా వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చే వారు తమ అనుభవాలను ఇతరులకు విడమరిచి మరీ చెబుతుంటారు.
అయితే ఈ పాతాళ భువనేశ్వర స్వామి ఆలయంలో ఒకప్పుడు పరమ శివుడు నరికిన వినాయకుడి తల ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. అది విగ్రహ రూపంలో ఉంటుంది. దాని వద్ద ఒక మూషికం (ఎలుక)ను కూడా మనం విగ్రహ రూపంలో చూడవచ్చు. సాక్షాత్తూ పరమశివుడే ఈ గుహకు కాపలా ఉంటాడని స్థల పురాణం చెబుతోంది. శివుడు తన కుమారుడని తెలియక మొదట వినాయకుడి తలను నరికాక, ఆ తరువాత ఏనుగు తల తెచ్చి అతికించాక, ఆ తల పడిన ఈ గుహకు వచ్చి శివుడు కొంత కాలం కాపలా ఉన్నాడట. అప్పటి నుంచి క్రీస్తుశకం 1191వ సంవత్సరంలో ఆది శంకరాచార్యుడి కాలం వరకు ఈ గుహను చూసిన వారు లేరని చరిత్ర చెబుతోంది.
ఇక ఈ ఆలయం ఉన్న గుహ కేవలం ఒక్క గుహే కాదు, పలు గుహలను వరుసగా కలిపే గుహల సమూహంగా ఉంటుంది. అయితే ఆలయం దాటి వెళితే ఇంకా కిందకు లోపలికి మరిన్ని గుహలు ఉంటాయట. వాటి గుండా వెళితే నేరుగా కైలాసాన్ని చేరుకోవచ్చని స్థల పురాణం చెబుతోంది. అయితే ఆ గుహల్లోకి వెళ్లడంపై నిషేధం విధించారు. ఎందుకంటే వాటిల్లో గాలి ఉండదు. వెళ్లిన కాసేపటికే ఊపిరాడక చనిపోతారు. అందుకని ఇంకా లోపలి గుహల్లోకి వెళ్లడంపై నిషేధం విధించారు. అయితే పాండవులు తాము చనిపోయే ముందు ఈ గుహకు వచ్చి వినాయకున్ని దర్శించుకుని ఆ లోతైన గుహల గుండా నేరుగా కైలాసానికి వెళ్లారని కూడా స్థల పురాణం చెబుతోంది.
ఆలయానికి ఇలా వెళ్లవచ్చు…
పాతాళ భువనేశ్వర్ ఆలయానికి సుమారుగా అర కిలోమీటర్ దూరం వరకు మోటారు వాహనాలకు అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆలయానికి నడిచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆలయం గుహ ముఖ ద్వారం నుంచి సుమారుగా 100 అడుగుల లోతుకు కిందకు వెళితే గర్భాలయం వస్తుంది. అక్కడే పాతాళ గణేషుడు కొలువై ఉంటాడు. పాతాళ భువనేశ్వర్‌కు చేరుకోవాలంటే విమాన మార్గంలో అయితే అక్కడికి సుమారుగా 370 కిలోమీటర్ల దూరంలో ఉండే డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి వెళ్లవచ్చు. అదే రైలు అయితే పాతాళ భువనేశ్వర్‌కు 192 కిలోమీటర్ల దూరంలో ఉన్న కథ్‌గోడమ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఢిల్లీ, కోల్‌కతా, డెహ్రాడూన్, మధురల నుంచి కథ్‌గోడమ్‌కు రైళ్లు ఉంటాయి. రోడ్డు మార్గంలో అయితే అల్మోరా, బిన్సార్, జగేశ్వర్, కౌసని, రాణిఖేత్, నైనిటాల్‌లలో ఏ పట్టణానికి చేరుకున్నా సరే అక్కడి నుంచి పాతాళ భువనేశ్వర్ ఆలయానికి సులభంగా వెళ్లవచ్చు.