రామాయణం అంటే తెలియనివారు లేరు. దేశంలోని అన్ని భాషల్లో మహానుభావులు ఎందరో దీన్ని వారివారి దర్శనీయకోణాల్లో దీన్ని రచించారు. వేద రుషుల నుంచి మొదలు పామర పండితుల వరకు దీన్ని తమతమ శక్తికొలది రాశారు, పాడారు. ఆ మహానుభావులందరూ చెప్పిన రామాయణాన్ని మరింత సరళంగా వేదాంత అర్థం, ఆధునిక జీవితానికి అన్వయించుకుంటూ చెప్పే ప్రయత్నంలో భాగంగా రామాయణం…
రఘునాథయ నాథాయ సీతాయః పతయే నమః!!
రామాయణాన్ని రాసిన మహర్షి వాల్మీకి ఆయన గురించి వర్ణిస్తూ…
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్!
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం!!
చిగుర్చిన చెట్లు, మొగ్గతొడిగిన కొమ్మలు, కాయలు పూసిన పూలతో నిండి రమణీయంగా ఉండే వసంతకాలంలో పచ్చని ఆకుల మధ్య కోకిల సంతోషంగా కూస్తుంది. అలాగే వాల్మీకి మహర్షికూడా మనసు నిండా రాముణ్ణి గానం చేస్తాడు. కోయిల ఒకే అక్షరం కూయగలిగితే వాల్మీకి అనేక అక్షరాలని గానం చేస్తాడు. వాల్మీకికీ రామరామా అనే ధ్వనే వచ్చు. వేసవిలో కూడా కోకిల కూత ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా వాల్మీకి రామకథ సాంసారిక బాధల్లో మగ్గిపోయే వారికి ఆనందాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఆ మహానుభావుడు చెప్పిన విషయాల్లో నాకు బుద్ధికి పరమాత్ముడు నాతో రాయించినంతా నేను రాసి మీకు అందిస్తాను. తప్పులున్న పెద్దమనసుతో క్షమించి.. ఆశీర్వదించండి.
శ్రీమద్రామాయణాన్ని రాసింది ఎవరు?
రామాయణం అంటే తెలియనివారు ఉండరు. అసలు రామాయణాన్ని రాసింది ఎవరూ అంటే పురాణాల్లో ఉన్న ప్రకారం చక్రే ప్రచేతసః పుత్రః తం బ్రహ్మప్యస్వమన్యత – వేదః ప్రాచేతసా దాసీత్ అనడం బట్టి ప్రచేతసుని పుత్రుడు ప్రాచేతసుడనే ఆయన రాశాడని తెలుస్తుంది.
ఇక రామాయణంలో రామాయణం రాసింది ఎవరో అని చూస్తే భార్గవేణ మహాత్మనా- భార్గవేణ తపస్వినా అని ఉంది. అంటే భార్గవుడు అనే తపోధనుడు రామాయణాన్ని రాశాడు అని ఉంది.
ఇదే ప్రశ్నను విష్ణుపురాణం రాసిన వ్యాసుడ్ని అడిగితే ఋక్షో భూద్భార్గవస్తాస్మాద్వాల్మీకిర్యో భిధీయతే అంటారు. రుక్షుడు అనే ఆయన రాశాడు అని చెప్పాడు. అసలు వాల్మీకినే నీ పేరేమిటి అని అడిగితే ప్రచేతసోహం దశమః పుత్రో రాఘవనందన! అనడం జరిగింది. ఆయన పేరు ప్రాచేతసుడు అని చెప్పాడు. అంటే రామాయణాన్ని రాసింది చివరకు ఎవరు అంటే ప్రాచేతసుడు. ఆయనే వాల్మీకి.
– కేశవ