సగం పక్షి, సగం సింహం ఇది ఏ దేవుడి అవతారమో తెలుసా?

-

నారాయణుడి దశావతారాలు అందరికీ తెలుసు. అలాగే శివుడు, గణేషుడు, కార్తీకేయులు కూడా పలు రూపాల్లో దుష్టసంహారాన్ని చేశారు. అలాంటి వాటిలో సగం పక్షి, సగం సింహ అవతారం ఒకటి. ఏ దేవుడు ఈ అవతారాన్ని ధరించాడు. ఎవరిని సంహరించాడో వంటి విశేషాలు తెలుసుకుందాం….

మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మన అవగాహన తక్కువే. అలాంటి శివుని అవతారాలలో ఒక్కటే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే రూపమే శరభ. దక్షిణాది ఆలయాలలో ఎక్కువగా కనిపించే ఈ రూపం వెనుక ఓ విశేషమైన కథ ఉంది… విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే. అయితే హిరణ్యకశిపుని సంహారం తరువాత కూడా ఆయన కోపం చల్లారనే లేదట. ఆ ఉగ్ర నారసింహుని క్రోధానికి లోకమంతా అల్లకల్లోలమైపోయింది. నరసింహుని నిలువరించకపోతే ఆయన కోపానికి ప్రకృతి సర్వనాశనం కాక తప్పదని భయపడ్డారు దేవతలు. అందుకోసం నరసింహుని నిలువరించమంటూ వారంతా కలిసి శివుని ప్రార్థించారట. అప్పుడు శివుడు తన అవతారాలైన వీరభద్ర, భైరవులని పంపాడట. కానీ నారసింహుని ముందు ఆ రెండు అవతారాలూ నిలువలేకపోవడంతో శరభ అవతారాన్ని ధరించాడు శివుడు. కొన్ని పురాణాల ప్రకారం శరభ, నరసింహ అవతారాల మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో నరసింహుడు ఓడిపోయాడు కూడా. మరి కొన్ని పురాణాల ప్రకారం శరభ అవతారాన్ని ఎదుర్కొనేందుకు విష్ణుమూర్తి గండభేరుండ పక్షిగా అవతరించాడు. రెండు తలలతో ఉండే ఈ పక్షి శరభని దీటుగా ఎదుర్కొంటుంది. ఎంతసేపు యుద్ధం జరిగినా గెలుపు ఓటములు తేలకపోవడంతో, రెండు అవతారాలూ యుద్ధాన్ని విరమించుకుంటాయి. ఎవరి మధ్య యుద్ధం జరిగినా, ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా శివకేశవులు ఇరువురూ ఒక్కటే కాబట్టి శరభను విష్ణుమాయగా వర్ణించేవారు కూడా లేకపోలేదు. కేవలం శివకేశవుల పురాణాలలోనే కాదు, బుద్ధుని జాతక కథలలో కూడా ఈ శరభ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ జాతక కథల ప్రకారం శరభ బుద్ధుని పూర్వ అవతారాలలో ఒకటి.

శరభ రూపం దక్షిణాదిన, అందునా తమిళనాట చోళులు నిర్మించిన శివాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిచోట్ల సకల ఆయుధాలతోనూ, దుర్గాదేవి సమేతంగా దర్శనమిస్తుంది. శివుని శరభేశ్వరునిగానో, శరభేశ్వరమూర్తిగానో కొలుచుకునే సంప్రదాయం తమిళనాట ఇంకా ప్రచారంలోనే ఉంది. ఇక తెలుగు రాష్ర్టాల్లోని శైవాలయాలలో కూడా ఈ రూపం కనిపిస్తున్నప్పటికీ, దానిని శరభ అవతారంగా పోల్చుకునే భక్తులు అరుదు. అలాగని శరభ అవతారాన్ని తెలుగువారు కూడా ఆరాధిస్తారు.ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాంతాలు మన రాష్ర్టాల్లో ఉన్నాయి. వీరశైవులు చేసే నృత్యాలలో శరభ, అశ్శరభ, దశ్శరభ అంటూ ఒళ్లు గగుర్పొడిచే అరుపులు వినిపిస్తాయి. తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ప్రచారంలో ఉంది. ఉగ్రమూర్తిగా ఈ స్వామి ఆరాధనతో ఈతి బాధలు, గ్రహదోషాలు, భయాలు పోతాయని ప్రతీతి.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news