ఏ శక్తిపీఠంలో అమ్మవారు రెండురూపాలు కన్పిస్తాయో తెలుసా ?

-

అష్టాదశ శక్తిపీఠాలు అంటే తెలియని భక్తులు ఉండరు. వాటిలో మూడు క్షేత్రాలు మరింత ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఉన్నవి. శ్రీశైలం, కాశీ, ఉజ్జయిని. అదేవిధంగా అమ్మ శక్తిపీఠంలో రెండురూపాల్లో కన్పించే అరుదైన దృశ్యం కూడా ఒక చోట కన్పిస్తుంది ఆ వివరాలు తెలుసుకుందాం….

కాశీ… వారణాసీ హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ సృష్టికర్త బ్రహ్మ ఈశ్వరుని వేడుకుంటూ పది అశ్వమేథయాగాలను చేశాడు. ఇప్పటికీ “దశాశ్వమేథఘాట్” అనే పుణ్యతీర్థాన్ని కాశీలో చూడగలుగుతాం. ఈ దశాశ్వమేథఘాట్‌కు ఇప్పటికీ బ్రహ్మదేవుడు పూజలు చేస్తుంటాడని ప్రతీతి. అటువంటి ఈ పుణ్యస్థలిలో భక్తులను బ్రోచే జగన్మాత విశాలాక్షిగా కొలువైంది. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు. మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోని ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, అటు పిమ్మట స్వయంభువును దర్శించుకోవాలి. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ, పుష్పమాలాంకృతురాలైన ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం.
స్థల చరిత్ర ప్రకారం…

బ్రహ్మ దేవుని మాట ప్రకారం.. దక్షుడు తన కూతురు సతీదేవిని శివునికిచ్చి పెళ్లి చేశాడు. సతీసమేతంగా శివుడు కైలాసములో ముల్లోకవాసుల పూజలందుకుంటున్నాడు. కొంతకాలం తర్వాత ప్రయాగ క్షేత్రంలో నవ బ్రహ్మలు సత్రయాగాన్ని చేయసాగారు. ఆ యాగానికి త్రిమూర్తులతో పాటు అష్టదిక్పాలకులు, ప్రజాపతులు, దేవతలు, మునులంతా విచ్చేశారు. ఆ సమయంలో దక్షప్రజాపతి యాగశాలలోకి ప్రవేశించాడు. దక్షుని రాకను చూసిన దేవతలంతా లేచి నిలబడి స్వాగతించారు. అయితే శంకరుడు కదలలేదు. శంకరుని చర్యను దక్షుడు అవమానంగా భావించాడు. శివుని చర్య వలన ధర్మం కుంటుపడుతోంది. అతడు నాకు అల్లుడైనందున శిష్యునితో సమానం. కాబట్టి నేను వచ్చినప్పుడు లేచి నిలబడి నన్ను గౌరవించాలి. నా కూతురిని ఇటువంటి దిగంబరికి, ఎముకలను నగలుగా ధరించేవానికి ఇచ్చినందుకు చింతిస్తున్నాను. ఇకపై ఇతని యాగాలలో హవిర్భాగాలు ఉండవని దక్షుడు నిందించాడు. అప్పటికీ శివుడు మౌనంగానే ఉన్నాడు.

ఈ సంగతిని విన్న నందీశ్వరుడు కోపంతో దక్షుని ముఖం మేక ముఖమైపోతుందని శపిస్తాడు. నందికి కూడ హవిర్భాగాలు లేవని దక్షుడు మళ్లీ నిందించాడు. అంతటితో దక్షుని కోపం చల్లారలేదు. బృహస్పతి సవనమనే మహాయాగాన్ని చేయ సంకల్పించి, ఆ యాగానికి సమస్త దేవతలను ఆహ్వానాలు పంపాడు. కానీ తన కుమార్తెన సతీదేవికి, అల్లుడు శివునికి ఆహ్వానాలు పంపించలేదు. యజ్ఞానికి దేవతలంతా వచ్చారు. అందరూ దక్షుని యజ్ఞానికి శివుడు ఎందుకు రాలేదని ప్రశ్నించసాగారు. అందుకతడు శివుని రకరకాలుగా తూలనాడసాగాడు. దేవతలు దాన్ని సహించలేకపోయారు. ఈలోపు కైలాసంలో ఉన్న సతీదేవికి తన తండ్రి చేస్తున్న యాగానికి తనను ఆహ్వానించలేదనే కోపంతో, శివుని మాటను సైతం లెక్కచేయకుండా యజ్ఞశాలకు వెళ్లి, అక్కడ తండ్రిచే అవమానింపబడి యోగాగ్నిలో దగ్ధమైంది.

ఆ సంభవాన్ని చూసిన రుద్రగణాలు యాగశాలను బీభత్సం చేయసాగాయి. నారదుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న శివుడు కోపంతో ఊగిపోతూ బ్రహ్మాండం బద్ధలయ్యేట్లు తన జటాజూటం నుంచి ఒక జటను లాగి నేలపై కొట్టగా, అందులో నుంచి ఉద్భవించిన కాళి, వీరభద్రులు దక్షయాగశాలకు వెళ్ళి ధ్వంసం చేసి, దక్షుని తలను తెంచి దక్షిణాగ్నిలో హోమం చేసి తిరిగి కైలాసం చేరుకున్నారు. ఆ తర్వాత కూడా శాంతించని శంకరుడు తన పత్ని సతీదేవిని భుజంపై వేసుకుని లోకాలన్నీ తిరుగుతూ అల్లకల్లోలం చేయసాగాడు. దేవతలు ఎంతగా ప్రార్థించినప్పటీకి ఆయన శాంతించలేదు. ఇదంతా చూస్తున్న మహావిష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించి సతీదేవి శరీరం ముక్కలు ముక్కలయ్యేలా చేశాడు. ఆ తల్లి శరీరభాగాలు పడిన చోట్లే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. అలా పుణ్యకాశీలో సతీదేవి చెవికి ఉన్న కుండలం పడిందట. మణికర్ణిగా శక్తి పీఠంలో విశాలాక్షిగా కొలువైందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి మహిమాన్వితమైన పుణ్యభూమిలో కొలువైన విశాలాక్షి దేవిని దర్శించుకునే వారికి సకలసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. అదండీ క్షేత్ర విశేషాలు. ఇక్కడ విశ్వనాథుడిని, విశాలాక్షిని దర్శించుకుంటే చాలు సకల పాపాలు పరిహారం అవ్వడమే కాకుండా ముక్తి కలుగుతుందని పెద్దల మాట.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news